- కేరళ కుర్రాడిపై ప్రశంసల వర్షం
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఓ భారతీయ విద్యార్థి దిగిన సెల్ఫీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ ఫొటోను చూసిన చాలామంది ఇది ఏఐ సృష్టించిన చిత్రమేమోనని భావించినప్పటికీ, అది అక్షరాలా నిజం. ఆ అరుదైన క్షణాన్ని సొంతం చేసుకున్నది కేరళకు చెందిన బాలుడు టెక్నాలజీ ప్రతిభావంతుడు రౌల్ జాన్ అజు. ఇప్పటికే ‘భారతదేశపు ఏఐ కిడ్’గా గుర్తింపు పొందిన రౌల్, తన అద్భుతమైన ప్రతిభతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు.
మాస్కోలో నిర్వహించిన ‘ఏఐ జర్నీ 2026’ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలిసిన రౌల్ ఆయనతో సెల్ఫీ దిగాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పతనంతిట్ట జిల్లా కొళంచేరి, ఎళుమటూర్‌లోని కరివతుమ్మూత్‌కు చెందిన అజు జోసెఫ్, షేబా ఆన్ దంపతుల కుమారుడే ఈ రౌల్.
పుతిన్‌తో దిగిన ఫొటోపై రౌల్ ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘ఇది ఎలా సాధ్యమైందో ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది ఏఐ సృష్టించిన చిత్రం కాదు. నా చిన్ననాటి కలలను నిజం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. మాస్కో సదస్సులో తనకంటే ఎంతో ఎక్కువ పరిజ్ఞానం, ప్రతిభ కలిగిన వారిని కలిశానని, వారి నుంచి నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని పేర్కొన్నాడు.
ప్రస్తుతం నార్త్ ఎడపల్లి జీహెచ్‌ఎస్‌ఎస్‌లో ప్లస్ టూ కామర్స్ చదువుతున్న రౌల్‌కు తొమ్మిదేళ్ల వయసులోనే సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తి, పట్టుదలే అతడిని కేవలం 12 ఏళ్ల వయసులోనే ‘రాబర్ట్’ను రూపొందించే స్థాయికి చేర్చాయి. అంతటితో ఆగకుండా పలు ఏఐ సాధనాలను అభివృద్ధి చేశాడు. ‘ఏఐ రియల్మ్ టెక్నాలజీస్’ పేరుతో సొంత సంస్థను కూడా ప్రారంభించాడు.
విద్యార్థులు, సాంకేతిక నిపుణుల్లో కృత్రిమ మేధస్సుపై అవగాహన పెంపొందించడంతో పాటు ప్రజా సేవల్లో ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడంలోనూ రౌల్ తనదైన పాత్ర పోషిస్తున్నాడు. చిన్న వయసులోనే సాంకేతిక రంగంలో తనదైన ముద్ర వేస్తూ, అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిభను చాటుతున్న ఈ కేరళ కుర్రాడిపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.







కామెంట్‌లు (0)