ప్రజాశక్తి - తుళ్లూరు : రాజధాని రైతుల కుటుంబంలో నేనూ ఒకడిగా భావించి ల్యాండ్ పూలింగ్ స్కీం (భూసమీకరణ పథకం) అమలుచేశానని మున్సిపల్ శాఖా మంత్రి పి నారాయణ చెప్పారు. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో శుక్రవారం శివాలయ పునః నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రిని రైతులు,భక్తులు పట్టు వస్త్రాలతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతుల త్యాగాలతోనే అమరావతి రాజధాని నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతోందన్నారు. రైతులతో తనకు ఎంతో అనుబంధం ఉందని, రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ సమయంలో ఉదయం నుంచి రాత్రి వరకు రైతుల మధ్యే ఉండి పనిచేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. రైతుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే అమరావతి తిరిగి రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చెందుతోందన్నారు. ల్యాండ్ పూలింగ్ కు తుళ్లూరు రైతులు ఎంతో సహకరించారన్నారు. తుళ్లూరు శివాలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉందన్నారు. ఈ ప్రాంతానికి పురాతన చరిత్ర ఉందని, అలాంటి చారిత్రక ఆలయాన్ని తిరిగి నిర్మించడం సంతోషకరమని పేర్కొన్నారు.
అమరావతి రాజధాని కోసం రైతులు చేసిన పోరాటంలో తుళ్లూరు శివాలయం కీలక స్థలంగా నిలిచిందని అన్నారు. శివాలయం నుంచి రైతులు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పాదయాత్రను ప్రారంభించారని గుర్తు చేశారు. రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు నాటి ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదుర్కొన్నారని మంత్రి అన్నారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకుండా అమరావతి కోసం పోరాడారని తెలిపారు.
అమరావతిలో రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రోడ్లు, ఇతర ప్రాథమిక మౌలిక వసతుల పనులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. రాజధానిలో వివిధ నిర్మాణ పనులను ప్రాజెక్టుల వారీగా చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ప్రతి నెలా ప్రాజెక్టుల వారీగా భవనాలను పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాజధానిలో ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నామని చెప్పారు. సీడ్ యాక్సెస్ రోడ్డును నేషనల్ హైవేతో అనుసంధానించే మూడో విడత నిర్మాణ పనులను, ఎలివేటెడ్ కారిడార్ పనులను వచ్చే శనివారం ప్రారంభిస్తామని తెలిపారు. పనులు వేగంగా జరిగేలా అవసరమైన యంత్రాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ మంత్రి నారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.







కామెంట్‌లు (0)