శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

చెరుకు రైతులు, కార్మికులకు బకాయిలు చెల్లించాలి

1 గంట క్రితం

vizag
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 04:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

వ్యవసాయ సంక్షోభం నుండి రైతాంగాన్ని ఆదుకోవాలి: ఏపి రైతు సంఘం డిమాండ్

ప్రజాశక్తి - చోడవరం : గోవాడ షుగర్స్ లో కార్మికులకు కర్షకులకు పాత బకాయిలు తక్షణమే చెల్లించాలని, వ్యవసాయ సంక్షోభం నుండి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏ.పి. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, చెరుకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేచలపు వెంకట రమణ (కాసుబాబు) అన్నారు. ఈ మేరకు రైతు సంఘాల నేతలు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు బకాయిపడిన రూ.38 కోట్ల వెంటనే చెల్లించాలని, సహకార రంగాన్ని, చెరుకు రైతులను బ్రతికించాలని, గోవాడ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం మూడు నియోజకవర్గాల రైతులు, ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారుగా 5 లక్షల మంది షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీని పూర్తిగా మూసివేసి ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అన్యాయం చేసిందని కార్మిక కర్షక నేత రెడ్డిపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.


రైతులకు పూర్తిగా చెరుకు పంట వేయకుండా అవకాశాన్ని కోల్పోయే విధంగా అర్ధాంతరంగా షుగర్ ఫ్యాక్టరీని మూసివేశారని, రైతులు జీవన పరిస్థితిని అగమ్యగోచరం గా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం చెరుకు పంట, తప్పితే వేరే పంటకు అనుకూలమైనది కాదని అన్నారు. గత సంవత్సరం చెరుకు పంటకు పెట్టుబడి పెట్టి షుగర్ ఫ్యాక్టరీ కి చెరుకు తరలించి నేటికి, పేమెంట్ చేయకపోవడంతో అప్పుల బాధలో మునిగిపోయి, రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ ప్రాంత రైతాంగం చెరుకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతాంగానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. గోవాడ ఫ్యాక్టరీలో కార్మికుల కర్షకుల పాత బకాయిల చెల్లింపుల కోసం సంక్రాంతి పండుగనాడు పస్తులతో సుమారు 23 రోజులు అఖిలపక్ష దీక్షలు చేపట్టారని అన్నారు. చోడవరం , మాడుగుల ఎమ్మెల్యేలు బకాయిల చెల్లింపులు జరిగేలా చూస్తామని హామీలు ఇచ్చి, దీక్షలు విరమింప చేసి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని అన్నారు. కార్మిక కర్షకుల బకాయిలు చెల్లింపులు చేతగాని మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే రైతులకు బకాయిలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. షుగర్ ఫ్యాక్టరీలో మరల క్రషింగ్ చేసే విధానాన్ని ప్రారంభించాలని అన్నారు. లేకుంటే రానున్న కాలంలో ఈ ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్