శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దళిత పేటలను అభివృద్ధి చేస్తారా.. శిలాఫలకాలతో సరిపెడతారా?

1 గంట క్రితం

guntur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 05:27 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

దళిత, గిరిజన పేటలకు నిధులు కేటాయించి, అభివృద్ధి చేయాలి

కే ఉమామహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి

కుంచనపల్లి లో సామాజిక శంఖారావం జీపు ప్రచార యాత్ర ప్రారంభం

ప్రజాశక్తి- తాడేపల్లి రూరల్ : రాష్ట్రంలో దళితులు, గిరిజనులు నివాస ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కే ఉమామహేశ్వర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, కుంచనపల్లి గ్రామంలో శుక్రవారం సామాజిక శంఖారావం జీపు జాతను స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ.. కుల వివక్ష లేని సమాజం కావాలని, దళితులు గిరిజనులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత నెల రోజుల కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్, సిఐటియు ఆధ్వర్యంలో విస్తృతంగా సర్వేలు జరిగాయని అన్నారు. నేటికీ దళితపేటలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం నాయకులు అధికారంలోకి రాకముందు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని, అధికారంలోకి వచ్చాక పేదల సమస్యలు పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది గ్రామాలలో ప్రజాసంఘాల నాయకులు నిర్వహించిన సర్వేలలో దళితపేటలలో కనీస సౌకర్యాలు మౌలిక వసతులు లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిథ్యం వహించే మంగళగిరి నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ లేక మంచినీటి సమస్య, మురుగు సమస్యలతో దళితులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భూగర్భ జలాలు కలుషితమై కుంచనపల్లి వంటి ప్రాంతంలో పేదలు మంచినీరు కొనుక్కునే పరిస్థితి దాపురించిందన్నారు. ఎక్కడి మురుగునీరు అక్కడే నిలిచి దుర్గంధం వెదజల్లుతున్న దోమలు ప్రబలుతున్న పట్టించుకునే నాధుడే లేరని ఆయన విమర్శించారు. వందలాది కోట్ల నిర్మాణంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపడతామని శిలాఫలకం వేశారని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ఎప్పుడు చేపడతారో లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. శిలాఫలకాలతో సరిపెడతారా? దళిత పేటలో అభివృద్ధి చేస్తారా కూటమి ప్రభుత్వం నాయకులు సమాధానం చెప్పాలన్నారు.

స్మశాన స్థలాలు లేక రాష్ట్రంలో అనేక గ్రామాలలో ఉన్నదాంట్లో శవాల మీద శవాలు పెట్టుకునే పరిస్థితి దళితులకు నేడు ఏర్పడిందన్నారు. రాజధాని ప్రాంతంలో ముఖద్వారంగా ఉన్న తాడేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో ఇంటి స్థలం కోసం, ఇళ్ల పట్టా కోసం వేలాదిమంది దరఖాస్తులు చేసుకుంటే 3,000 మందికి మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఇదేనా అభివృద్ధి అంటే అని ఆయన ప్రశ్నించారు. బడా కంపెనీలకు 99 పైసలకి భూములు ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వం పేదవాడు నివసించేందుకు రెండు సెంట్లు స్థలం కూడా ఇవ్వలేదా అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ మూడు సంవత్సరాలలో దళితులపైన దాడులు అధికమయ్యాయి అన్నారు. మహిళల జోలికొస్తే తాట తీస్తామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళలపై జరిగే అత్యాచారాలు, దాడులపై నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. స్థానికంగా పేదలు, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఈనెల 24వ తేదీన గుంటూరు కలెక్టరేట్ వద్ద జరుగు సామాజిక శంఖారావం ధర్నాను జయప్రదం చేసేందుకు దళితులంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం సామాజిక శంఖారావం ప్రచార జాత మండలంలోని గుండిమెడ, వడ్డేశ్వరం, కొలనుకొండ గ్రామాలలో ప్రచారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జెట్టి బాలరాజు, కెవిపిఎస్ గుంటూరు జిల్లా కార్యదర్శి జె నవీన్ ప్రకాష్, కెవిపిఎస్ గుంటూరు జిల్లా నాయకులు బూరుగ వెంకటేశ్వరరావు, ఏనుగుల కమలాకర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వేమల దుర్గారావు, సిఐటియు తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ, నీరుడు దుర్గారావు, కెవిపిఎస్ నాయకులు బి యెషయ్య, విజయ్, కే మేరీ, ఆటో యూనియన్ నాయకులు గోపాలం శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్