ప్రభుత్వం స్పందించాలని నినాదాలు
రోజురోజుకు పెరుగుతున్న మద్దతు
ప్రజాశక్తి -అనంతపురం : తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జూనియర్ వైద్యులు (జూడాలు) శుక్రవారం అనంతపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్, కోర్టు రోడ్డు మీదుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) సర్కిల్ వరకు ఈ ర్యాలీ సాగింది. జూడాలు చేపడుతున్న నిరసనకు రోజురోజుకూ ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి మద్దతు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంపై నిరసనకారుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. వైద్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న జూనియర్ వైద్యుల సమస్యలను పరిష్కరించకుండా జాప్యం చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ర్యాలీ అనంతరం జీజీహెచ్ సర్కిల్ వద్ద జూడాలు ఫ్లాష్‌మాబ్ నిర్వహించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్లకార్డుల ద్వారా తమ సమస్యలను ప్రజలకు వివరించారు. వైద్యులుగా ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతను నిర్వర్తిస్తున్న తమ బాధను కూడా ప్రభుత్వం మానవతా దృక్పథంతో అర్థం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. తమ నిరసన ప్రజలకు ఇబ్బంది కలిగించేందుకు కాదని, తమ ఆవేదనను ప్రజల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈర్యాలీలో ఏపీ జూడా అధ్యక్షుడు డాక్టర్ రంజిత్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ మనోదర్శన్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు డాక్టర్ మేఘనారెడ్డి, డాక్టర్ సాయిరామ్, డాక్టర్ ప్రేమ్, అధికార ప్రతినిధి డాక్టర్ మనోజ్ కుమార్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ సాయికీర్తి, ఉపాధ్యక్షుడు డాక్టర్ వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)