గువహటి : మూడేళ్ల తర్వాత ఇంఫాల్-గువహటి బస్సు సర్వీసు శుక్రవారం ప్రారంభమైంది. నాగాలాండ్‌లోని దిమాపూర్ మీదుగా ఈ సర్వీస్ వెళ్లనుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మణిపూర్‌లోని రెండు ప్రధాన మార్గాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘నేషనల్ హైవే -2’ పై వెళ్లే ఈ బస్సు సర్వీసు.. రాష్ట్ర ప్రజలకు బయటి ప్రపంచంతో అనుసంధానం కల్పించే ప్రధాన రవాణా మార్గంగా ఉండేది. అయితే, 2023 మే 3న కుకీ, మైతేయిల మధ్య చెలరేగిన జాతి ఘర్షణల కారణంగా ఈ రవాణా సేవ తీవ్రంగా దెబ్బతింది.
శుక్రవారం ఉదయం ఇంఫాల్ నుండి అస్సాం రాజధాని గువహటికి రెండు బస్సులు, ఐదు వింగర్ వాహనాల్లో 125 మంది ప్రయాణికులు బయలుదేరారని మణిపూర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. గువహటికి వెళ్తున్న ఈ బస్సులు మధ్యాహ్న సమయంలో నాగాలాండ్‌లోకి ప్రవేశించే ముందు, కుకీల ప్రాబల్యం ఉన్న కాంగ్‌పోక్సీ జిల్లా, నాగాలు అధికంగా ఉండే సేనాపతి జిల్లా మీదుగా ప్రయాణించనున్నాయని అన్నారు.







కామెంట్‌లు (0)