- అన్నమయ్య జిల్లాలో నామినేషన్ల ఘట్టంలో పెచ్చరిల్లిన హింస
- పుంగనూరులో ఎంపి మిధున్ రెడ్డి వాహనంపై దాడి
- ఆయన గన్‌మేన్‌కు గాయం
- రాయచోటిలో వైసిపి కార్యాలయానికి నిప్పు
- ఆరు కార్లు దగ్ధం
- పలు మున్సిపాల్టీల్లో నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేత
- టిడిపి అరాచకానికి పాల్పడిందని వైసిపి శ్రేణుల ఆరోపణ
ప్రజాశక్తి-యంత్రాంగం : స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పుంగనూరులో ఎంపి మిధున్ రెడ్డి వాహనంపై దాడి జరిగింది. రాయచోటిలో వైసిపి కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. పలు జిల్లాల్లో వైపిపి వారి నామినేషన్లను గుర్తు తెలియని వ్యక్తులు లాక్కొని చింపివేశారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో నామినేషన్ వేయడానికి వైసిపి రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆరు కార్లలో నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. అదే సమయంలో నామినేషన్ వేయడానికి వచ్చిన టిడిపి శ్రేణులు అక్కడే ఉన్నాయి. కార్యాలయంలోకి ఎంపి కారు వేగంగా ప్రవేశించడంతో అది తగిలి తమ కార్యకర్తకు స్వల్పమైందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. వివాదం నెలకొని ఇరుగ్రూపుల వారు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. సుమారు 15 కార్లు ధ్వంసమయ్యాయి. రాయి తగిలి ఎంపి గన్‌మేన్ తలకు స్వల్పగాయమైంది. పోలీసులు ఇరుగ్రూపులనూ చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎస్పి అక్కడికి వచ్చి ఎంపి మిథున్‌రెడ్డిని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి రక్షణ కల్పించారు. పరిస్థితి పూర్తిగా సద్దుమణిగే వరకూ సుమారు గంటపాటు ఎంపిని అక్కడే ఉంచారు. మున్సిపల్ చైర్మన్ స్థానానికి టిడిపి నుంచి ఒక నామినేషన్, వార్డులకు టిడిపి నుంచి 18, జనసేన నుంచి ఒక నామినేషన్ దాఖలయ్యాయి. ఉద్రిక్తత నేపథ్యంలో వైసిపి నుంచి ఇక్కడ ఒక్క నామినేషన్ కూడా పడలేదు.
రాయచోటి వైసిపి అభ్యర్థుల నామినేషన్ నేపథ్యంలో సంజీవ్ నగర్‌లోని పార్టీ కార్యాలయానికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీని పక్కవీధిలో టిడిపి కార్యాలయం ఉంది. పార్టీ అభ్యర్థుల నామినేషన్ నేపథ్యంలో ఆ కార్యాలయానికి టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. ఇరుపార్టీల కార్యకర్తలు రోడ్డుపై గుంపులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసిపి కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. ఆ కార్యాలయ కిటికీలు, తలుపులపై పెట్రోలు పోసి నిప్పుపెట్టారు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కారుతోపాటు మొత్తం ఆరు కార్లను దగ్ధం చేశారు. కొన్ని ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని దుండగులను చెదరగొట్టారు. ఫైర్ ఇంజన్‌ను రప్పించి మంటలను అదుపు చేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి వెళ్లిన ట్రాఫిక్ సిఐ వాహనం అద్దాలను దండుగులు పగలగొట్టారు. దగ్ధం, ధ్వంసమైన వాహనాలను పోలీసులు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. తమ కార్యాలయంపై దాడికి పాల్పడింది, వాహనాలను దగ్ధం, ధ్వంసం చేసింది టిడిపి వారేనని మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, రమేష్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే సహించేది లేదని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, హింసకు తావులేదని, ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తామని అన్నారు.
బిజెపి దాడిలో వైసిపి వారికి గాయాలు
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఉద్రిక్తంగా సాగింది. దీంతో, పట్టణం అట్టుడికింది. పట్టణంలోని బిఎస్ఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో మున్సిపల్ కౌన్సిలర్ల నామినేషన్ల సందర్భంగా వైసిపి, బిజెపి గ్రూపులు ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నాయి. నామినేషన్లు వేసేందుకు పలువురు వైసిపి అభ్యర్థులు తమ మద్దతుదారులతో బిఎస్ఆర్ పాఠశాల వద్దకు వచ్చారు. పట్టణం నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వైసిపి కార్యకర్తలు వచ్చారంటూ బిజెపి నాయకులు నినాదాలు చేశారు. దీంతో, ఇరుగ్రూపుల మధ్య మాటామాట పెరిగి రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో వైసిపికి చెందిన బగ్గిరి బయపరెడ్డి, ఆదినారాయణ నాయుడు, అప్రాచెరువు ఈశ్వరయ్య, బాలం గోపాల్ గాయపడ్డారు. వారిని తొలుత ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పరామర్శించారు. వారిని ఆసుపత్రి నుంచి వీల్చైర్లలో నేరుగా తీసుకెళ్లి పట్టణంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో రౌడీ రాజ్యం నడుస్తోందని, ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని విమర్శించారు. ఎస్పి సతీష్‌కుమార్, అడిషనల్ ఎస్పి మహేష్ ధర్మవరం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ధర్నా చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టి అక్కడి నుంచి పంపించివేశారు.
గుత్తిలో వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కారుపై దాడి
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాల్టీలో వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గంటా నరహరి కారు అద్దాన్ని దుండగులు రాయి విసిరి పగులగొట్టారు. ఈ చర్యకు టిడిపి వారే పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేత
కడప కార్పొరేషన్ లో 30 డివిజన్ నుంచి వైసిపి తరఫున నామినేషన్ పత్రాలతో విజయలక్ష్మి వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు వాటిని లాక్కొని పరారయ్యారు. ఈ చర్యకు టిడిపి వారే పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైసిపి అభ్యర్థి జమీలున్నీసా బీ నామినేషన్ పత్రాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోదరుడు చించివేశారని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు మున్సిపల్ కార్యాలయంలోని సిసిటివి ఫుటేజీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసిపి నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఖండించారు. ఇరు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది.
తిరుపతి కార్పొరేషన్ బైరాగిపట్టెడ 15వ డివిజన్ సచివాలయానికి వైసిపికి చెందిన గణేష్ తన భార్య, మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలతో వెళ్లగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాటిని దౌర్జన్యంగా లాక్కొని చించివేశారు. అడ్డువచ్చిన వారిపై పిడిగుద్దులు గుద్దారు. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి 12వ డివిజన్ లో వైసిపి తరఫున నామినేషన్ వేసేందుకు కార్పొరేటర్ అభ్యర్థితో వచ్చారు. నామినేషన్ పత్రాలను దుండగులు లాక్కొని చింపివేశారు. ఈ చర్యకు టిడిపి వారే పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగాయి. వారిని పోలీసులు చెదరగొట్టారు. 55, 35 డివిజన్లతో నామినేషన్లు వేయనీయకుండా కూటమి శ్రేణులు అడ్డుకున్నాయని వైసిపి
శ్రేణులు ఆరోపించాయి.









కామెంట్లు (0)