శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డీలిమిటేషన్‌కు మద్దతు

30 నిమిషాల క్రితం

డీలిమిటేషన్‌కు మద్దతు
- లోక్‌‌సభ స్థానాలు 50శాతం పెంపుతో అందరికీ  ప్రయోజనం
-అన్నిపార్టీలు కలిసి రావాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 10:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- లోక్‌‌సభ స్థానాలు 50శాతం పెంపుతో అందరికీ ప్రయోజనం

- అన్నిపార్టీలు కలిసి రావాలి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. శుక్రవారం నాడు జ‌న్‌ప‌థ్ 1లో ఏర్పాటుచేసిన విలేక‌రుల స‌మావేశంలో కేంద్ర మంత్రులు హెచ్‌డి కుమారస్వామి, కె రామ్మోహ‌న్‌నాయుడు, ఎంపి పెమ్మసాని చంద్రశేఖర్‌‌తో కలిసి ఆయన మాట్లాడుతూ ఆ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచడంతో అన్ని రాష్ట్రాలకూ ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల అమలు ఇప్పుడు కీలక దశకు చేరుకుందని తెలిపారు. మహిళలకు రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన సమయం వచ్చిందన్నారు. మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌ బిల్లులకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చి, కలిసి రావాలని కోరారు. ‘సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌’ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. 1971 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 58.8 కోట్లుగా ఉన్నప్పుడు లోక్‌సభలో 543 స్థానాలు ఉండేవని, ప్రస్తుతం జనాభా సుమారు 147 కోట్లకు చేరినా స్థానాల సంఖ్య అదే విధంగా ఉందని పేర్కొన్నారు. 1971లో ప్రతి పది లక్షల మందికి ఒక ఎంపి ప్రాతినిధ్యం వహిస్తే, ప్రస్తుతం సుమారు 27 లక్షల మందికి ఒక ఎంపి ప్రాతినిధ్యం వహిస్తున్నారని వివరించారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా 50 శాతం సీట్లు పెరిగితే సుమారు 18 లక్షల మందికి ఒక ఎంపి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందన్నారు. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు గతంలో కీలక పాత్ర పోషించాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేశానని చంద్రబాబు తెలిపారు. ఫెర్టిలిటీ రేటును తగ్గించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఇప్పుడు జనాభా నిర్వహణ విధానంలో ప్రోత్సాహకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. 1971 జనాభా ప్రాతిపదికన 1976లో తొలిసారి డీలిమిటేషన్‌ జరిగిందని, ఆ తరువాత‌ కూడా పాత జనాభా లెక్కల ఆధారంగానే స్థానాల పునర్విభజన కొనసాగిందని గుర్తుచేశారు.

ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం రాష్ట్రాల వారీ లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచితే ఆంధ్రప్రదేశ్‌లో 25 స్థానాలు 38కి చేరుతాయని, తమిళనాడులో 59, కర్ణాటకలో 42, తెలంగాణలో 26, కేరళలో 30 స్థానాలు ఉంటాయని వివరించారు. దక్షిణాది రాష్ట్రాల మొత్తం పార్లమెంటు స్థానాలు 195కు చేరతాయని చెప్పారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉందని, ప్రజల్లో అనవసర అసంతృప్తి, ఆందోళనలు తలెత్తుతాయని అన్నారు. రాష్ట్రాల ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని కాపాడుతూ స్థానాలను పెంచడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం 13.96 శాతమే ఉందని, 2019లోనూ దాదాపు 14 శాతంగా ఉందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారని, రాజకీయాల్లోనూ వారికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్