శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్పొరేట్‌ లాభాలను పక్కనబెట్టి ప్రజా శ్రేయస్సుకే పెద్ద పీట!

23 నిమిషాల క్రితం

కార్పొరేట్‌ లాభాలను పక్కనబెట్టి ప్రజా శ్రేయస్సుకే పెద్ద పీట !
- లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందే
- ప్రధాని మోడీకి సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ లేఖ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 11:06 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందే

- ప్రధాని మోడీకి సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ లేఖ

న్యూఢిల్లీ: కార్పొరేట్లకు ప్రయోజనాలు కల్పించే చర్యలను పక్కనపెట్టి, ప్రజా సంక్షేమానికి, వారి శ్రేయస్సుకు పెద్దపీట వేసినప్పుడే ప్రధాని నరేంద్ర మోడీ నిజాయితీ రుజువవుతుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ స్పష్టం చేశారు. ఇటీవల ఫిక్కీ సమావేశంలో ప్రధాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన శుక్రవారం మోడీకి లేఖ రాశారు. లేబర్ కోడ్లు, పార్లమెంట్ కార్మికుల ప్రదర్శన వంటి అంశాలను అందులో వివరించారు.

ఈ నెల 20న జరిగిన ఫిక్కీ శతవార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని ప్రసంగాన్ని పూర్తిగా విన్నాకే లేఖ రాస్తున్నట్లు బేబీ తెలిపారు. ఆ వేదికపై ప్రధాని మాటలు ఒక రకంగా అసాధారణ అంగీకారమని అభివర్ణించారు. భారత పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ‘‘ఉద్యోగుల వేతనాలు పెంచారా? ఉద్యోగుల సంఖ్యను పెంచారా? లేదు’’ అని ప్రశ్నించడాన్ని, కార్పొరేట్ల ఆకలి ఎంత పెట్టినా తీరడం లేదన్న వ్యాఖ్యలనూ ప్రస్తావించారు. ఆర్థిక విధానాలతో సత్ఫలితాలు సాధించిన ప్రభుత్వ నేత మాట్లాడే మాటలు ఇవి కావని, గత 12 ఏళ్లుగా ప్రభుత్వ విధాన కేంద్రంలో ఉన్న వైరుధ్యాన్ని ఇవి చివరకు వర్ణిస్తున్నాయని పేర్కొన్నారు.

లాభాలు పెరిగాయి... వేతనాలు పడిపోయాయి

పన్ను రాయితీల లాభాలను ప్రజలకు అందించడంలో కార్పొరేట్ రంగం విఫలమైందన్న ప్రధాని మాట సరైనదేనని బేబీ అన్నారు. కార్పొరేట్ పన్ను రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించినా వాస్తవిక వేతనాలు దారుణంగా పడిపోయాయని పేర్కొన్నారు. 2017-18, 2023-24 మధ్య రెగ్యులర్ వేతన జీవులైన పురుషుల ద్రవ్యోల్బణ సర్దుబాటు సంపాదన 6.4 శాతం, మహిళల ఆదాయాలు 12.5 శాతం క్షీణించాయని తెలిపారు. మరోవైపు కార్పొరేట్ లాభాలు గణనీయంగా పెరిగాయని వివరించారు. 2020, 2026 ఆర్థిక సంవత్సరాల మధ్య నిఫ్టీ-500 కంపెనీల ఆదాయాలు 28.7 శాతం వార్షిక చక్రవడ్డీ రేటుతో పెరిగాయి. ఆర్థికేతర కార్పొరేట్ లాభాలు 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కోట్లు ఉండగా, 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.7.1 లక్షల కోట్లకు చేరాయని పేర్కొన్నారు. దేశంలోని అగ్రశ్రేణి ఒక శాతం మంది వద్ద దేశ సంపదలో 40 శాతం ఉందని, గత 12 ఏళ్లలో టాప్ 10 శాతానికి, అట్టడుగు 50 శాతానికి మధ్య ఆదాయ అంతరం పెరిగిందని తెలిపారు. ఇది శతకోటీశ్వరులను మరింత దేశభక్తులుగా ఉండమని చెప్పడం ద్వారా పరిష్కారమయ్యే ‘‘ట్రికిల్-డౌన్’’ వైఫల్యం కాదని, నయా ఉదారవాద విధానాల వల్ల వచ్చిన వ్యవస్థాగత ఫలితమని విమర్శించారు.

సరళీకరణతో ఉపాధి పోయింది..

నాలుగు లేబర్ కోడ్లను సమీక్షించాల్సి ఉందని బేబీ అన్నారు. ప్రస్తుతమున్న 29 చట్టాలను సంఘటితం చేస్తూ తెచ్చిన ఇవి 2025 నవంబర్ 21న అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం వీటిని సరళీకరణగా, కార్మికులకు వరంగా చెప్పినా కార్మిక సంఘాల అనుభవాలు భిన్నంగా ఉన్నాయన్నారు. ఈ కోడ్లు లేఆఫ్‌లు, మూసివేతల నిబంధనలను సడలించాయని, కాంట్రాక్టు కార్మికుల పరిధిని విస్తరించాయని, పనిగంటలను పెంచాయని, యూనియన్ల ఏర్పాటుకు, సమష్టి బేరసారాలకు ఉన్న అవకాశాలను పరిమితం చేశాయని లేఖలో వివరించారు. స్వాతంత్ర్య అనంతరం కార్మిక హక్కులపై జరిగిన తీవ్ర దాడుల్లో ఇదొకటన్నారు. కార్మిక సంఘాలన్నీ విమర్శిస్తున్నాయని, నోటిఫై చేసినప్పటి నుంచి నిరసన తెలుపుతున్నాయని గుర్తుచేశారు. సరళీకరణ విదానాలతో ఉపాధి పెరగదని, మరింత ప్రమాదకర సమస్యలు తలెత్తుతాయని భారత్‌తో పాటు ఇతర దేశాల అనుభవాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ ఏడాది మార్చిలో యువత నిరుద్యోగం 15.2 శాతంగా ఉందని, జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో పట్టణ యువతలో అది 18.9 శాతానికి పెరిగిందని బేబీ తెలిపారు. దేశంలోని 63.4 కోట్ల మంది కార్మికుల్లో దాదాపు 87 శాతం అసంఘటిత రంగంలోనే ఉన్నారని పేర్కొన్నారు. అలాగే, ఆదాయపు పన్ను ఉపశమనం రూ.12 లక్షల వరకు ఇచ్చామని, ప్రతిగా పరిశ్రమలు వేతనాలు పెంచాయా అని ప్రధాని ప్రశ్నించడాన్ని బేబీ ప్రస్తావించారు. ఆ తర్కం ప్రకారం ప్రధాని పరిశ్రమలను వేడుకోవడం ఆపి, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, జీవన వ్యయానికి అనుగుణంగా చట్టబద్ధమైన జాతీయ కనీస వేతనం అమలు చేయాలని. నెలకు రూ.42 వేల కనీస వేతనం, సార్వత్రిక కనీస పింఛను ఇవ్వాలని, ప్రభుత్వ ఉపాధి కార్యక్రమాల సమగ్రతను పునరుద్ధరించాలని, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లను చట్టబద్ధ ప్రయోజనాలతో రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని, నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని, కార్మిక సంస్థలను బలోపేతం చేసి, ప్రస్తుత వేతన, భద్రతా చట్టాలను అమలు చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, ఆర్థిక విధానాల రూపకల్పనలో కార్మిక ప్రతినిధులను సమాన భాగస్వాములను చేయాలని కోరారు.

కార్మిక ప్రతినిధులను కలవండి..

విఫలమైన ట్రికిల్-డౌన్ భారాన్ని దేశ సంపదను సృష్టించే శ్రామికులు భరించరని బేబీ తెలిపారు. వారికి అభివృద్ధి నమూనా కావాలన్నారు. వచ్చేనెల 1 నుంచి 3 వరకు పార్లమెంట్ కార్మికుల మహా ప్రదర్శన జరుగుతోందన్నారు. ప్రధాని ఆ ప్రతినిధులను కలిసి, వారి సాధకబాధకాలు విని, డిమాండ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. లేబర్ కోడ్లను ఉపసంహరించి, వేతనాలు పెంచి, కార్పొరేట్ లాభాల కన్నా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ప్రధాని మాటల్లోని నిజాయితీ రుజువవుతుందని లేఖలో స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్