- డిఎంకె, ఎన్‌సిపి (ఎస్‌పి) ఎంపీలకు మోడీ సర్కార్ గాలం !
- ఆ పార్టీలు మద్దతిచ్చినా ..మరో ఓటు అవసరం
- వైసిపి నాలుగు ఓట్లపైనే ఎన్‌డిఎ ఆశలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)ను, మహిళా రిజర్వేషన్లకు ముడిపెట్టి రూపొందించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తనదైన శైలిలో వ్యూహాలు పన్నుతోంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో మూడింట రెండొంతుల మెజార్టీ తప్పనిసరి. అయితే బిజెపి నేతృత్వ ఎన్‌డిఎకు అంత సంఖ్యాబలం లేదు. ఈ నేపథ్యంలో డిఎంకె, ఎన్‌సిపి (శరత్ పవార్) సహా కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు మోడీ సర్కార్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. లోక్‌సభలో ప్రస్తుతం 540 మంది సభ్యులున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కనీసం 360 మంది సభ్యుల మద్దతు అవసరం. డిఎంకెకు 22 మంది, ఎన్‌సిపి (ఎస్‌పి)కి 8 మంది ఎంపిలున్నారు. ఈ పార్టీల మద్దతు లభిస్తే బిల్లుకు అవసరమైన మెజార్టీ సాధించడం ఎన్‌డిఎకు కొంత సులభం కానుంది. ఒకవేళ డిఎంకె, ఎన్‌సిపి (శరత్ పవార్) పార్టీలు మద్దతిచ్చినా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఆర్‌జెడి ఓటింగ్‌కు దూరంగా ఉన్నా, ప్రభుత్వానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజార్టీకి మరో ఒక్క ఓటు తక్కువవుతుంది. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఎన్‌డిఎ, వైసిపి కలిపి 353 ఓట్లు సాధించే అవకాశముంది. అయితే బిల్లు ఆమోదానికి 354 ఓట్లు అవసరం కానున్నాయి.
గతంలో 54 ఓట్ల తేడాతో వీగిపోయిన బిల్లు
గత ఏప్రిల్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. అప్పట్లో ఓటింగ్‌లో పాల్గొన్న 528 మంది సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజార్టీకి 352 ఓట్లు అవసరం కాగా, ప్రభుత్వం 54 ఓట్ల వెనుకబడింది. దీంతో డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాలకు సంబంధించిన రెండు బిల్లులు వీగిపోయాయి. ఈసారి లోక్‌సభలో అవసరమైన 360 ఓట్లను సాధించేందుకు చిన్న ప్రాంతీయ పార్టీలకు చెందిన కనీసం ఆరుగురు ఎంపిల మద్దతు ఇప్పటికే లభించిందని బిజెపి శ్రేణులు చెబుతున్నాయి. తాజా ప్రతిపాదన ప్రకారం లోక్‌సభ స్థానాలను గరిష్టంగా 850కు పెంచడంతోపాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను ప్రస్తుత సంఖ్యతో పోలిస్తే 50 శాతం నిష్పత్తిలో పెంచే ప్రతిపాదన కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం.
డిఎంకె, ఎన్‌సిపి మద్దతు కీలకం
లోక్‌సభలో డిఎంకెకు 22 మంది, ఎన్‌సిపి (ఎస్‌పి)కి ఎనిమిది మంది సభ్యులున్నారు. ఈ రెండు పార్టీలు బిల్లుకు మద్దతిస్తే ప్రభుత్వానికి 353 ఓట్లు వస్తాయి. ఆప్‌కు చెందిన ముగ్గురు, ఆర్‌జెడికి చెందిన నలుగురు సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉంటే అవసరమైన మెజార్టీ 354కు తగ్గుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఒక్క ఓటు వెనుకబడుతుంది. డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ బిల్లును పరిశీలించిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల వాటా 7.18 శాతం తగ్గకుండా రాజ్యాంగపరమైన హామీ ఇవ్వాలని ఆ పార్టీ ప్రధానంగా కోరుతోంది. ఎన్‌సిపి (ఎస్‌పి) నేత సుప్రియా సూలే కూడా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బిల్లును పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
చివరి ఓటుపైనే ఉత్కంఠ
ప్రభుత్వానికి అవసరమైన చివరి ఓటు ఎక్కడి నుంచి వస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో డిఎంకె మిత్రపక్షమైన విసికెకు చెందిన ఇద్దరు ఎంపిల వైఖరి కీలకం కానుంది. అలాగే జెఎంఎంకు చెందిన ముగ్గురు, విసికెకు చెందిన ఇద్దరు, ఆర్‌ఎల్‌పికి చెందిన ఒక ఎంపి మద్దతు లభించే అవకాశాలపైనా బిజెపి అంచనాలు వేస్తోంది. వీరంతా మద్దతిస్తే ప్రభుత్వానికి ఐదు ఓట్ల అదనపు మెజార్టీ లభించవచ్చు. మరోవైపు ప్రతిపక్ష ఎంపిలు ఇద్దరు ఓటింగ్‌కు గైర్హాజరైనా అవసరమైన మెజార్టీ 353కి తగ్గి ప్రభుత్వానికి బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. స్వతంత్ర ఎంపి అమృత్‌పాల్ సింగ్ జాతీయ భద్రతా చట్టం కింద అస్సాంలోని జైలులో ఉండగా, ఇంజినీర్ రషీద్ కూడా జైలులోనే ఉన్నారు. వీరు ఓటింగ్‌కు హాజరుకాకపోవడం ప్రభుత్వానికి అనుకూలంగా మారవచ్చు. అయితే ఎన్‌డిఎ సభ్యులు గైర్హాజరైతే ప్రభుత్వానికి మెజార్టీ సాధించడం మరింత కష్టమవుతుంది.
రాజ్యసభలోనూ సవాలే
డిసెంబరు 2న సమావేశం కానున్న రాజ్యసభలోనూ బిల్లుకు మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. మొత్తం 244 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటే 164 ఓట్లు కావాలి. ఎన్‌డిఎకు సుమారు 154 మంది సభ్యుల బలం ఉండగా, వైసిపి సభ్యులతో కలిపి ఈ సంఖ్య 158కు చేరుతుంది. దీంతో మరో ఆరు ఓట్లు అవసరమవుతాయి. డిఎంకె, ఎన్‌సిపి (ఎస్‌పి)తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు బిజెపి నాయకత్వం ప్రయత్నిస్తోంది. పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందినప్పటికీ, రాష్ట్రాల ప్రాతినిధ్యంలో మార్పులు జరుగుతున్నందున రాజ్యాంగంలోని 368(2) అధికరణ ప్రకారం కనీసం సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది.







కామెంట్‌లు (0)