మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జానపద జాతర కోలాటం పోటీలకు కలెక్టర్‌కు ఆహ్వానం

2 గంటల క్రితం

chittoor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 04:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -చిత్తూరు: జిల్లాలోని జానపద కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘జానపద జాతర’ కోలాటం పోటీలకు జిల్లా కలెక్టర్‌ను మంగళవారం జానపద వృత్తి కళాకారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు మురళి, జిల్లా సంఘం గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు, అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్ర, రవికుమార్‌ మాట్లాడుతూ.. జిల్లాలో కనుమరుగవుతున్న జానపద కళలను పరిరక్షించడంతోపాటు కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బంగారుపాళెం వేదికగా జరిగే కోలాటం పోటీల్లో జిల్లాలోని సుమారు 100 గ్రామాల నుంచి కళాకారులు పాల్గొంటారని చెప్పారు. సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక పాటలతో ఆధునిక పద్ధతుల్లో కోలాటం ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా జిల్లాలో విస్తృతంగా ఉన్న జానపద కళలను పరిరక్షించేందుకు ఈ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీల్లో వేలాది మంది కళాకారులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కళాకారుల్లో అధిక సంఖ్యలో మహిళలు ఉన్నందున వారిని మరింతగా ప్రోత్సహించాలని కోరారు. దేవాలయాల్లో జరిగే బ్రహ్మోత్సవాలు, ఇతర గ్రామీణ ఉత్సవాల్లో జానపద కళాకారులకు ప్రదర్శనలు ఇచ్చే అవకాశాలు కల్పించి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు జిల్లా కలెక్టర్‌ను సత్కరించి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సంఘం కోశాధికారి రాజేంద్రనాయుడు, నాయకులు సుందర్‌రాజు, నాగరాజు, మణి, దిలీప్‌కుమార్‌, వరదరాజు, మహేష్‌, సుజాతమ్మ, శ్రీదేవమ్మ, రమాదేవి తదితరులు ఉన్నారు.

నవంబర్‌లో నిర్వహించనున్న జానపద జాతర కోలాటం పోటీలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమం జరిగే ప్రాంతంలో విద్యుత్‌, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరం వంటి మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోటీల ప్రారంభ కార్యక్రమానికి తాను హాజరవుతానని హామీ ఇవ్వడంతో కళాకారుల సంఘం నాయకులు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్