కక్షిదారుల సమయం, డబ్బు ఆదా చేసే సత్వర పరిష్కార వేదిక లోక్ అదాలత్
పీలేరు 11వ అదనపు జిల్లా జడ్జి ఏ. మహేష్
ప్రజాశక్తి-పీలేరు : ఈ నెల 12న నిర్వహించనున్న లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పీలేరు 11వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవాధికార సంఘం చైర్మన్ ఏ. మహేష్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కోర్టు ఆవరణలో ఆయన మాట్లాడుతూ.. కక్షిదారులు తమ విలువైన సమయం, డబ్బు వృథా కాకుండా పరస్పర అవగాహనతో లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా వివాదాలకు సత్వర పరిష్కారం లభించడంతో పాటు కక్షలు, భయాలు తొలగి ప్రజలు సోదరభావంతో కలిసిమెలిసి జీవించే వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకోకుండా పరస్పర సహకారంతో ముందుకు సాగినప్పుడే సమాజ అభివృద్ధితో పాటు దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని అన్నారు. వ్యక్తిగత ప్రశాంతత, అభివృద్ధికి కూడా లోక్ అదాలత్ దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ సివిల్ జడ్జి షేక్ పెద్ద ఖాసీం, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జియావుద్దీన్ షేక్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)