శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రతిష్టాత్మకమైన GSLV-F17 రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అధునాతన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-05) ప్రయోగం.. విజయవంతమైంది. ఈ చారిత్రాత్మక విజయం పట్ల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తీవ్ర హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను, ఈ ప్రయోగంలో పరోక్షంగా, ప్రత్యక్షంగా పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. దేశం గర్వించదగ్గ రోజుగా దీనిని ఆయన అభివర్ణించారు.
ప్రధాని మోడి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ .... జియోసింక్రోనస్ కక్ష్య నుంచి పని చేసే భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమైన EOS-05 విజయవంతంగా ప్రయోగించబడటం దేశానికి ఎంతో గర్వకారణం అని అన్నారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగాన్ని నిర్వచించే శ్రేష్ఠత, నిరంతర ఆవిష్కరణలు, అంతకంతకూ పెరుగుతున్న సాంకేతిక సామర్థ్యాలకు నిదర్శనం అని ఆయన కొనియాడారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఇస్రో, భారతీయ ప్రైవేట్ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం మన అంతరిక్ష కార్యక్రమానికి కొత్త బలాన్ని, మరింత ఉన్నతమైన స్థాయిని జోడిస్తోందని మోదీ స్పష్టం చేశారు. ఈ అద్భుతమైన కలయిక వల్ల మొత్తం అంతరిక్ష పర్యావరణ వ్యవస్థలో భారతదేశ సామర్థ్యాలు నలుదిశలా విస్తరిస్తున్నాయని ఆయన ప్రశంసించారు.
ఈ సరికొత్త ప్రయోగం దేశ భద్రత, సరిహద్దుల పర్యవేక్షణ, వ్యూహాత్మక సమాచార సేకరణలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. EOS-05 ఉపగ్రహం భూమికి సుమారు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న జియోసింక్రోనస్ కక్ష్యలో ఉండి నిరంతరాయంగా భూభాగాన్ని పరిశీలన చేస్తుంది. సాధారణంగా తక్కువ భూ కక్ష్యలో ఉండే ఉపగ్రహాల లాగా కాకుండా, ఇది భూమి భ్రమణ వేగంతో సమానంగా తిరుగుతూ, 24 గంటల పాటు ఒకే ప్రాంతంపై నిరంతర దృష్టి పెడుతుంది. అందుకే దీనిని శాస్త్రవేత్తలు "ఐ ఇన్ ది స్కై" (Eye in the Sky) అని పిలుస్తున్నారు. ఈ ఉపగ్రహం సహాయంతో సున్నితమైన దేశ సరిహద్దులు, వ్యూహాత్మక ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లోని మార్పులు, వ్యవసాయ భూముల వాతావరణ పరిస్థితులు, అలాగే ఆకస్మికంగా వచ్చే ప్రకృతి విపత్తుల వంటి వాటిపై ఎప్పటికప్పుడు అత్యంత స్పష్టమైన సమాచారం లభిస్తుంది. దాదాపు 2,367 కిలోగ్రాముల భారీ బరువున్న ఈ అధునాతన ఉపగ్రహం, భారత దేశం జియోసింక్రోనస్ కక్ష్యలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి డెడికేటెడ్ ఇమేజింగ్ ఉపగ్రహంగా చరిత్ర సృష్టించింది. ఇందులో అమర్చిన అధునాతన మల్టీ-స్పెక్ట్రల్ కెమెరాలు చాలా అధిక రిజల్యూషన్ తో భూమిని స్పష్టంగా ఫోటోలు తీయగలవు. గతంలో చేపట్టిన GSLV-F10/EOS-03 ప్రయోగం క్రయోజెనిక్ దశలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల విఫలమైన తరువాత, ఈ తాజా ప్రయోగం ఇస్రోకు భారీ ఊరటనూ, శాస్త్రవేత్తలకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.







కామెంట్‌లు (0)