శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అడోబ్‌ కు కొత్త సిఇఒ గా భారతీయుడు అనిల్‌ చక్రవర్తి

2 గంటల క్రితం

Indian-origin Anil Chakravarthy named new CEO of Adobe.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 11:16 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

అమెరికా : అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ అడోబ్‌ కు కొత్త సిఇఒ గా భారతీయుడు అనిల్‌ చక్రవర్తి నియమితులయ్యారు. ప్రస్తుతం సిఇఒ గా కొనసాగుతున్న శంతను నారాయణ్‌ ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో అనిల్‌ చక్రవర్తిని ఎంపిక చేసినట్లు కంపెనీ ప్రకటించింది. డిసెంబర్‌ 1 నుంచి అనిల్‌ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ప్రభావం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో డిజైన్‌, క్రియేటివ్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి అడోబ్‌ ప్రయత్నిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో సంస్థ నాయకత్వంలో మార్పు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా అడోబ్‌ సిఇఒ గా ఉన్న శంతను నారాయణ్‌ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు కంపెనీ మార్చిలోనే ప్రకటించింది. అయితే ఆయన సంస్థతోనే కొనసాగుతూ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుత ఎఐ ఆధారిత సాంకేతికతల కాలంలో అడోబ్‌ వృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు అనిల్‌ చక్రవర్తి సరైన వ్యక్తి అని శంతను నారాయణ్‌ అభిప్రాయపడ్డారు. సంస్థలో తన అనుభవాన్ని ఉపయోగించుకుని భవిష్యత్తులో అడోబ్‌ను మరింత అభివృద్ధి చేసే సామర్థ్యం అనిల్‌కు ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌కు చెందిన అనిల్‌ చక్రవర్తి ఐఐటీ వారణాసి నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (MIT)లో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌తో పాటు పీహెచ్‌డీ పట్టాలు పొందారు. 2020లో అడోబ్‌లో చేరిన ఆయన సంస్థలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. అడోబ్‌లో చేరిన తర్వాత కొంతకాలం డిజిటల్‌ ఎక్స్‌పీరియన్స్‌ వ్యాపార విభాగానికి నాయకత్వం వహించారు. ఆ తర్వాత కస్టమర్‌ సపోర్ట్‌ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో సంస్థ గ్లోబల్‌ సేల్స్‌ కార్యకలాపాలను కూడా ఆయన పర్యవేక్షించారు. దీంతో అడోబ్‌లోని వివిధ కీలక విభాగాలపై అనిల్‌కు విస్తృత అనుభవం ఏర్పడింది. అడోబ్‌లో చేరకముందు అనిల్‌ చక్రవర్తి క్లౌడ్‌ డేటా మేనేజ్‌మెంట్‌ సంస్థ ఇన్‌ఫర్మాటికాలో పనిచేశారు. అక్కడ నాలుగేళ్లపాటు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు. ఈ అనుభవంతో పాటు అడోబ్‌లో గత కొన్నేళ్లుగా నిర్వహించిన కీలక బాధ్యతల నేపథ్యంలో ఇప్పుడు సంస్థకు సిఇఒ గా ఆయన నియమితులయ్యారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్