నేపాల్ : నేపాల్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదల్లో వేలాదిమంది గల్లంతైన వేళ ఆశలు చిగురించే ఓ ఘటన చోటుచేసుకుంది. శిథిలాలు, మట్టి, బురదతో పూర్తిగా మూసుకుపోయిన జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో చిక్కుకున్న ఇద్దరు కార్మికులు తొమ్మిది రోజుల తర్వాత సజీవంగా బయటపడ్డారు. ఈ ఘటన సహాయక సిబ్బందిలోనే కాకుండా గల్లంతైన వారి కుటుంబాల్లోనూ కొత్త ఆశలు నింపింది.
త్రిశూలి ప్రాంతంలోని త్రిశూలి-3 ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 26 న సంభవించిన భారీ వరదలతో టన్నెల్ ప్రవేశద్వారం మట్టి, బురద, శిథిలాలతో పూర్తిగా మూసుకుపోయింది. అప్పటి నుంచి లోపల చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ బృందాలు నిరంతరం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో తొమ్మిదో రోజు ఇద్దరు కార్మికులు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
నేపాల్ హోంమంత్రి సుదన్ గురుంగ్ తెలిపిన వివరాల ప్రకారం ... రక్షించబడిన వారిలో కబీర్ మహార్జన్ (45), సంజయ్ షా (30) ఉన్నారు. కబీర్ మహార్జన్ త్రిశూలి-3ఏ ప్రాజెక్టులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండగా, సంజయ్ షా నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీలో మెకానికల్ ఫోర్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. టన్నెల్‌లో తొమ్మిది రోజులపాటు చిక్కుకున్నప్పటికీ వారు ప్రాణాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. టన్నెల్‌లోని ఒక పొడి గదిలో వారు ఉండటం వల్లే ఇంతకాలం ప్రాణాలతో ఉండగలిగారని రెస్క్యూ సిబ్బంది వెల్లడించారు. రక్షించే సమయానికి సంజయ్ షా మాట్లాడే పరిస్థితిలో లేరని అధికారులు తెలిపారు. దీంతో అతడిని వెంటనే విమానంలో బట్టార్ ప్రాంతానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కబీర్ మహార్జన్ స్పృహలోనే ఉన్నారని ఆయన భార్య వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను ఖాట్మాండులోని ఛావునీ మిలటరీ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇద్దరు కార్మికులను టన్నెల్ నుంచి బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు స్థానిక టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. బురదతో తడిసిపోయిన ఒక కార్మికుడిని రక్షక సిబ్బంది భుజాలపై మోసుకెళ్లగా.. మరో వ్యక్తిని బయటకు తీసుకొచ్చే సమయంలో చేతులు జోడించి ప్రార్థిస్తున్న దృశ్యం కనిపించింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తొమ్మిది రోజులపాటు చీకటి, బురద మధ్య ప్రాణాల కోసం పోరాడి సురక్షితంగా బయటపడటం నిజంగా అద్భుతమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే నేపాల్‌లోని మరికొన్ని జలవిద్యుత్ ప్రాజెక్టుల టన్నెళ్లలో కూడా పెద్ద సంఖ్యలో కార్మికులు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దాదాపు అరడజను టన్నెళ్లలో 150 మందికిపైగా చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తం 12 జలవిద్యుత్ ప్రాజెక్టులకు చెందిన సుమారు 900 మంది కార్మికులు గల్లంతైనట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. వీరిలో దాదాపు 500 మంది టన్నెళ్లలో చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. వారిని గుర్తించి రక్షించేందుకు ఇంజినీర్లు టన్నెళ్లలోకి గాలిని పంపుతూ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఆగస్టు 26న సంభవించిన ఈ ప్రకృతి విపత్తు నేపాల్‌లోని పలు పట్టణాలు, లోయలను తీవ్రంగా ప్రభావితం చేసింది. హిమనదం (గ్లేసియర్) కూలిపోవడం వల్లే ఆకస్మిక వరదలు సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 1,259 మంది మృతి చెందగా, 5,000 మందికిపైగా గల్లంతైనట్లు నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. తొమ్మిది రోజుల తర్వాత ఇద్దరు కార్మికులు సజీవంగా బయటపడటంతో.. ఇంకా ఎక్కడైనా శిథిలాలు, టన్నెళ్లలో చిక్కుకుని ఉన్నవారిని కూడా రక్షించవచ్చన్న ఆశలు మరింత బలపడ్డాయి.







కామెంట్‌లు (0)