ఎయు ఘటనపై ఎస్ఎఫ్ఐ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి అజయ్, నాయకులు తరుణ్‌కు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ క్రమశిక్షణ ఉల్లంఘన నోటీసు ఇవ్వడాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమస్యలపై తరచూ వినతులివ్వడం, అధికారులను ప్రశ్నించడం, విద్యార్థులను సమీకరించి సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు నిర్వహించడం క్రమశిక్షణ ఉల్లంఘనగా చిత్రీకరించడం దుర్మార్గమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి రామ్మోహన్, కె ప్రసన్నకుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా సమస్యలు, అధ్యాపక నియామకాలు, విశ్వవిద్యాలయ అభివృద్ధి వంటి అంశాలపై ప్రశ్నించడం విద్యార్థుల ప్రజాస్వామిక హక్కు అని అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయ అధికారులపై ఉందని సూచించారు. సమస్యలపై ఎవరూ ప్రశ్నించకూడదని, అధికారుల నిర్ణయాలను ప్రశ్నించకుండా ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా విద్యార్థులు సమీకృతం కాకూడదనే విధంగా నోటీసులో పేర్కొన్న అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయ ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థిపై ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. విద్యార్థుల గొంతులను అణచివేయడం ద్వారా ప్రతిష్ట పెరగదని, నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు, ప్రజాస్వామిక వాతావరణం కల్పించినప్పుడే విశ్వవిద్యాలయానికి నిజమైన గౌరవం లభిస్తుందని వివరించారు. డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా కాకుండా, స్వేచ్ఛగా ఆలోచించే, ప్రశ్నించే, సామాజిక బాధ్యతతో వ్యవహరించే పౌరులను తయారుచేసే కేంద్రాలుగా ఉండాలని సూచించారు. క్రమశిక్షణ పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం, వారి ఉద్యమాలను అడ్డుకోవడం ద్వారా విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామిక హక్కులను కాలరాయాలని చూడటం సరైన విధానం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల నుంచి వచ్చే ప్రతి వినతి, ఆందోళనను ప్రజాస్వామిక దృక్పథంతో స్వీకరించాలి తప్ప, వారిని హెచ్చరికలతో భయపెట్టకూడదని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే ఈ నోటీసును ఉపసంహరించుకోవాలని, విద్యార్థుల ప్రజాస్వామిక హక్కులను గౌరవించాలని తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)