శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దాడి నేపథ్యంలో ఎంపి మిథున్‌కు జగన్‌ ఫోన్‌

9 గంటల క్రితం

jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 07:26 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌, సిజెఐ, ఎన్‌‌హెచ్‌ఆర్‌‌సికి ఎంపి గురుమూర్తి లేఖ

- రాష్ట్ర ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు

రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిథున్‌‌రెడ్డిపై దాడిని మాజీ సిఎం జగన్‌‌మోహన్‌‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయనపై దాడి జరిగిన నేపథ్యంలో ఫోన్లో పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరపాలన్న ఉద్దేశం చంద్రబాబుకు లేదని విమర్శించారు. రెండున్నరేళ్ల పరిపాలన పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, అందుకనే అరాచకాలు, దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. హింసా రాజకీయాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌లా మార్చారని, లోక్‌సభలో పార్టీ నాయకుడికే భద్రతలేని పరిస్థితులు చూస్తున్నామని అన్నారు. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారని, పోలీసులను వాడుకుని అక్రమాలు చేస్తున్నారని, దాడులు జరుగుతున్నా పోలీసు వ్యవస్థ నిస్తేజంగా ఉండిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయాలను సమర్థంతంగా ఎదుర్కొంటామని, న్యాయపరంగా, చట్టపరంగా అన్ని రకాలుగా పోరాటం చేస్తామని తెలిపారు. ధైర్యం, సహనంతో ఈ ఎన్నికలను ఎదుర్కొంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను కోర్టుల ముందు ఉంచుతామని, పారామిలటరీ బలగాలతోనే ఎన్నికలు సజావుగా జరుగుతాయని పేర్కొన్నారు. హింసతో రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రివిలేజ్‌ ‌కమిటీ విచారణకు విజ్ఞప్తి

మిథున్‌‌రెడ్డిపై దాడుల నేపథ్యంలో వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నామినేషన్లు వేయనీయడం లేదని, చించేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పార్లమెంటు ప్రివిలేజ్‌ ‌కమిటీకి, రాష్ట్రపతి, సిజెఐ, ప్రధాని, లోక్‌‌సభ స్పీకర్‌‌, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌, కేంద్ర ఎన్నికల సంఘానికి తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. సిట్టింగ్ ఎంపి భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడిందని తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. హైకోర్టు ఆదేశాలున్నా యథేచ్ఛగా దాడులు జరిగాయని, పుంగనూరు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. నిందితులపై కఠిన సెక్షన్లతో చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. దాడి ఘటనపై రాజ్యాంగబద్ధమైన జోక్యం చేసుకోవాలని, పార్లమెంటరీ హక్కుల ఉల్లంఘనపై విచారణ జరిపించాలని కోరారు. టిడిపి శ్రేణులు పథకం ప్రకారం రాళ్లదాడికి దిగారని, దీనిలో మిథున్‌‌రెడ్డితోపాటు, ఆయన గన్‌‌మెన్లకు గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్న ఒక సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడిపై పట్టపగలే ఇంతటి దాడి జరగడం రాష్ట్రంలో భద్రతా వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో అధికరణ 21 ప్రకారం పౌరులకు కల్పించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు, అధికరణ 14 ప్రకారం సమానత్వానికి తీవ్ర విఘాతం కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు, బెదిరింపులు ఎదుర్కొంటున్న అభ్యర్థులకు రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా 24 గంటల్లోనే ఇంతటి తీవ్ర దాడి జరగడం న్యాయ వ్యవస్థను మరియు చట్టబద్ధ పాలనను సవాలు చేయడమేనని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్