- నిందితులను కఠినంగా శిక్షించాలి : సిపిఎం డిమాండ్
ప్రజాశక్తి - పంగులూరు (ప్రకాశం జిల్లా)
పంగులూరు మండలం రేణింగవరం పోలీస్ స్టేషన్‌లో జరిగిన లాకప్‌డెత్ కేసులో అధికారులు న్యాయ విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని సిపిఎం డిమాండ్ చేసింది. పంగులూరులోని సిపిఎం కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు సిహెచ్ మజుందార్, పార్టీ మండల కార్యదర్శి తలపనేని రామారావు మాట్లాడారు. గత నెల 30న అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను రేణింగవరం పోలీసులు పట్టుకున్నారని, అందులో దివ్య తేజ అనే వ్యక్తిని లాకప్ డెత్ చేసి రోడ్డు పక్కన పడవేయడం దుర్మార్గమైన చర్యని అన్నారు. దొంగతనాలు చేస్తున్న వ్యక్తిపై కేసు పెట్టి చట్టానికి అప్పజెప్పాలని, అంతేగాని ఒక వ్యక్తిని చంపే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. వ్యక్తిని చంపడమే కాకుండా, దాన్ని దాచి పెట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఇటీవల కాలంలో ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారని, ఇటీవల శంఖవరప్పాడు దగ్గర పోలీసుల డబ్బు, గంజాయి, మద్యం బయటపడిన విషయాన్ని గుర్తు చేశారు. పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. లాకప్ డెత్ విషయం ఈ ప్రాంతంలో కలకలం రేపిందని, దీనిపై సమగ్రంగా విచారణ జరపాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పోస్టుమార్టం రిపోర్ట్ ను బట్టి చర్యలు : డిఎస్‌పి
దివ్య తేజ మృతి విషయంలో పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఏదైనా చర్యలు తీసుకుంటామని దర్శి డిఎస్‌పి బాలమురళీకృష్ణ తెలిపారు. దివ్య తేజ మృతి విషయమై శనివారం ప్రజాశక్తి డిఎస్‌పి వివరణ తీసుకుంది. డిఎస్‌పి బాలమురళీకృష్ణ మాట్లాడుతూ దివ్య తేజ మరణం గురించి అందరికీ తెలిసిందేనని, అతను పోలీసుల నుండి తప్పించుకుని పోయి మరణించాడని, అయితే అతని బంధువులు మాత్రం పోలీసులు లాకప్ డెత్ చేశారని ఆరోపిస్తున్నారని, ఈ ఆరోపణలో నిజం లేదని చెప్పారు. గత నెల 29న తెల్లవారుజామున పోలీసుల కంటపడిన ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి దొరికాడని, రెండో వ్యక్తి పారిపోయాడని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు ఏ విధంగా వస్తుందో చూడాలని, రిపోర్టును బట్టి చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు.








కామెంట్‌లు (0)