- మంత్రి బిసి జనార్థన్ రెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి మెరుగుదల, ఆర్ధికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి జనార్థన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలో నిర్మితమవుతున్న జువ్వలదిన్నె మత్స్యకార హార్బర్ ఇందుకు ప్రత్యేక నిదర్శనమని, హార్బర్ కు సంబంధించి కీలకమైన నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు అర్హత కలిగిన సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సమర్థవంతంగా నిర్వహించడం, పరిశుభ్రత, భద్రత, మానవ వనరుల వినియోగం, మౌలిక సదుపాయాల నిర్వహణను మరింత మెరుగుపరచడం కోసం కార్యకలాపాలు, నిర్వహణ (ఒ అండ్ ఎం) కింద ప్రతిపాదనలు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రైవేట్ నిర్వహణతో పరిశుభ్రత, భద్రత, ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్, వేలం వ్యవస్థ మరింత సమర్థవంతంగా నిర్వహణ మత్స్యకారులకు మెరుగైన సేవలు అందుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం జువ్వలదిన్నె షిఫింగ్ హార్బర్‌ను ఆధునిక షిఫింగ్ సెంటర్‌గా అభివృద్ధి చేసి, మత్స్యకారుల ఆదాయం, జీవన ప్రమాణాలు, ఎగుమతి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో ఇప్పటివరకు రూ.306.29 కోట్ల వ్యయంతో 95.51 శాతం భౌతిక పురోగతి సాధించిందని తెలిపారు. హార్బర్‌లో 1,250 మత్స్యకార బోట్లకు నిలుపుదల సౌకర్యం కల్పించగా, ఇందులో 1,000 మోటరైజ్డ్ బోట్లు, 200 మెకనైజ్డ్ బోట్లు, 50 ట్యూనా లాంగ్‌లైనర్ బోట్లకు వసతి కల్పించే విధంగా రూపకల్పన చేశారని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)