మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నిర్థారిత తేదీల్లో దీపం సబ్సిడీ

16 గంటల క్రితం

cm cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 10:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- లిటిగెంట్‌ పిటీషనర్లకు కౌన్సిలింగ్‌

- రాష్ట్ర వ్యాప్తంగా 81 మంది గుర్తింపు

- ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు

‌ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో దీపం పథకం లబ్దిదారులకు ఇచ్చే సబ్సిడీని క్రమపద్దతిలో ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సబ్సిడీని నిర్ధారిత తేదీల్లో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్న ఆర్టీజీఎస్ సెంటర్లో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపం పథకం సబ్సిడీ మంజూరుపై పౌర సరఫరాల శాఖ-ఆర్థిక శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలించి అమలు చేయాలని ఆదేశించారు. ‘లిటిగెంట్ పిటిషనర్లను ఏ విధంగా కట్టడి చేయాలి, ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకుండా చేసే ఫిర్యాదు దారులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 81 మంది లిటిగెంట్ పిటిషనర్లు ఉన్నట్టు గుర్తించామని, వీరు సరాసరి ఒక్కొక్కరు 246 పిటిషన్లు పెడుతున్నట్లు వెల్లడించారు. వీరి వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపించాలని, వారు పెట్టే అర్జీల్లో ప్రజా ప్రయోజనాలు ఉంటే వాటిని పరిశీలించి పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వాన్ని, అధికారులను బద్నాం చేసే ఉద్దేశంతో పిటిషన్లు పెట్టే వారిని గుర్తించాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రాధాన్యతల వారీగా ఆర్థిక సమస్యలను పరిష్కరిద్దామని, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం 49 శాతం లోటు వర్షపాతం ఉంది. ఈ ప్రభావం నుంచి బయటపడేసే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఈ మేరకు రైతుల్లో అవగాహన కల్పించడం, ఆరుతడి పంటలను వేసేలా రైతులను ప్రొత్సహించాలన్నారు. ఇదే సమయంలో వీబీ జీ రామ్ జీ పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని, జలధార పనులకు వీబీ జీ రామ్ జీ పనుల్ని అనుసంధానం చేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేసేలా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను (ఆర్‌ఎస్‌‌కె) ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పాస్ పోర్టు సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పని చేస్తాయని వెల్లడించారు. ప్రజలకు వాస్తవాలు వివరించే బాధ్యతను అధికారులు తీసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేయాలన్నారు. అలాగే డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఇబ్బంది లేని విధంగా మార్గాలు చూపనున్నట్లు వెల్లడించారు. ప్రజాభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పని విధానం మార్చుకోవాలని, పరిపాలనా విధానాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. సమస్యలు ఉత్పన్నమయ్యాక చర్యలు తీసుకోవడంతోపాటు... ముందుగానే ఏయే సమస్యలు వస్తాయనే విషయాన్ని అంచనా వేసి.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో సిఎస్‌ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్