మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

లాఠీచార్జ్‌ చేసేందుకే చర్చల పేరుతో ‘ ఉచ్చు’ : అభిజీత్‌ దీప్కే

7 గంటల క్రితం

Abhijeet Dipke
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 12:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : తమ ప్రతినిధి బృందాన్ని చర్చల పేరుతో పిలిచి పార్లమెంట్‌ మార్చ్‌ చేపడుతున్న నిరసనకారులపై లాఠీ చార్జ్‌ చేసేందుకు కేంద్రం ఉచ్చు పన్నిందని కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) కార్యకర్త అభిజీత్‌ దీప్కే మండిపడ్డారు. చర్చలతో తమ ప్రతినిధులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా నివాసానికి పిలిచి, అదే సమయంలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చల కోసం వెళ్లిన తమ నాయకులు సౌరభ్ దాస్, అశుతోష్ శంకాలను అక్కడే నిర్బంధించి, వారి ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో మూడు గంటల పాటు వారితో ఎలాంటి సంప్రదింపులు జరపలేకపోయామని అన్నారు. "సమస్యకు పరిష్కారం చూపుతామన్న పేరుతో చర్చలకు పిలిచారు. కానీ మమ్మల్ని అక్కడికి రప్పించిన వెంటనే బయట నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. ఇది ముందే పన్నిన ఉచ్చు" అని దీప్కే ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రక్షించేందుకే విద్యార్థులపై పోలీసులు "అమానుషంగా లాఠీచార్జ్" చేశారని ఆయన విమర్శించారు. గుంపును చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్లు వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ, బాష్పవాయువు ప్రయోగించి లాఠీలతో దాడి చేయడం ద్వారా విద్యార్థులపై బలప్రయోగం చేశారని అన్నారు. దేశ భవిష్యత్తైన విద్యార్థుల తలలు పగలగొట్టాల్సిన అవసరం ఏముంది?" అని ప్రశ్నించారు. మహిళలపై కూడా పోలీసులే దాడులకు పాల్పడ్డారని దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికలను కొట్టడం, వారి దుస్తులు చింపేయడం, గొంతులు పట్టుకోవడం వంటి ఘటనలు జరిగాయని ధ్వజమెత్తారు. ఈ చర్యలకు బాధ్యులైన పోలీసు అధికారులు, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల చేతిలో క్రూరంగా హింసించబడిన సిజెపి మద్దతుదారులకు ఆయన క్ష‍మాపణలు తెలిపారు.

సోమవారం జరిగిన ఘటనల నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించాలన్న నిర్ణయాన్ని మార్చుకున్నారని దీప్కే తెలిపారు. విద్యార్థులపై జరిగిన చర్యలకు నిరసనగా ఆయన దీక్షను కొనసాగించాలని నిర్ణయించుకున్నారని, ఈ విషయాన్ని తన భార్య ద్వారా పంపిన లేఖలో వెల్లడించారని చెప్పారు. పోలీసుల కఠిన చర్యలు తమ ఉద్యమాన్ని ఆపలేవని స్పష్టం చేసిన దీప్కే , తమ నిరసన కొనసాగుతుందని అన్నారు. త్వరలోనే తదుపరి భారీ కార్యక్రమాన్ని ప్రకటిస్తామని అన్నారు.

నీట్‌ యుజి-2026 ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ వేలాది మంది నిరసనకారులు సోమవారం పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి హింస, రాళ్ల దాడి, విధ్వంసం కేసుల్లో 118 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని, ఇప్పటివరకు ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిరసన సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసమే చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్