శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎల్‌‌నినోను ఎదుర్కొందాం

1 గంట క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 12:38 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

• సిద్ధంగా ఉండండి

• మంత్రివర్గ సమావేశంలో సిఎం

• సోషల్‌ ‌మీడియా నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎల్‌‌నినో వల్ల వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఎల్‌‌నినోతో వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగంతో పాటు, మంత్రులు, ఎంఎల్‌ఎలు సిద్ధం కావాలని అన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని, రైతులను ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను మీడియాకు వివరించిన రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖమంత్రి కొలుసు పార్ధసారధి ఎల్‌‌నినోపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ప్రత్యామ్నాయ మార్గాలనే అన్వేషించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. తాగునీరు, పశుగ్రాసం సమస్య రాకుండా చూసుకోవాలని అన్నారని, జలధార కార్యక్రమం ఈ సమయంలో బాగా ఉపయోగపడుతుందని, ఆ కార్యక్రమ పనులు ఎంతవరకు వచ్చాయో క్షేత్ర స్థాయిలో సమీక్షించాలని ఆదేశించారని తెలిపారు. కేబినెట్‌ ‌సమావేశంలో సోషల్ మీడియాపై నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థ తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అసత్య ప్రచారం, వ్యక్తిత్వ హననం, అసభ్యకర పోస్టులు, ద్వేషపూరిత వ్యాఖ్యలు వంటివి ప్రజాస్వామ్య విలువలకు, ప్రభుత్వ వ్యవస్థలకు, సామాజిక సామరస్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని తెలిపారు. ప్రస్తుత సమాచార సాంకేతిక చట్టాల్లో ఉన్న అవకాశాలు, లోపాలను పరిశీలించి, చట్టపరమైన అన్ని మార్గాలను వినియోగిస్తూ నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైతే నేరస్థులను చట్టపరంగా జైలుకు పంపే చర్యలు కూడా తీసుకుంటామని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సోషల్‌ ‌మీడియా రెస్పాన్స్‌ సెల్‌ ఏర్పాటు, సోషల్ మీడియా దుర్వినియోగం, మహిళలు, బాలికలపై సైబర్ వేధింపుల నివారణకు ప్రత్యేకంగా రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని సమర్థవంతంగా అరికట్టేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాలు, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు అమలుచేస్తున్న చట్టాలు, విధానాలు, నియంత్రణ వ్యవస్థలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.

రాజధాని రైతులకు కౌలు పెంపు

2024 జూన్‌ 12 నుంచి రాజధానికి భూసమీకరణలో భూములు అందించిన రైతులకు కౌలు మెట్ట భూములకు ఎకరానికి రూ.40 వేలు, జరీబు భూములకు ఎకరానికి రూ.60 వేలు పెంచేందుకు ఆమోదం తెలిపామన్నారు. సిఆర్‌‌డిఎలో 634 ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకు 12 నెలల కాలానికి చెల్లించే గ్రాంట్‌‌ను నెలకు రూ.5,000 నుంచి 10,000కు పెంచేందుకు ఆమోదం. భూ సమీకరణ పరిధిలోకి వచ్చే గుంటూరు, పల్నాడు జిల్లాలోని ఏడు గ్రామాల్లో రుణ మాఫీ పథకాన్ని అమలు చేయడానికి, పథకం అమలుకు మార్గదర్శకాలను రూపొందించడానికి, బకాయి వ్యవసాయ రుణాల అర్హత నిర్ణయ ప్రతిపాదనను ఆమోదించామన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో ఐఐటి - జెఇఇ, నీట్‌ ‌పరీక్షల కోసం విద్యార్థులకు ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు విశాఖపట్నం జిల్లాలోని మేఘాద్రి గెడ్డ, గుంటూరు జిల్లాలోని తాడికొండ, నెల్లూరు జిల్లా కోటలోని గురుకులాన్ని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపామని చెప్పారు. నేషనల్‌ ‌ఫిషరీస్‌ ‌డెవలప్‌‌మెంట్‌ ‌బోర్డు, ఇషా ఫౌండేషన్‌, ఆర్ట్‌ ఆఫ్‌ ‌లివీంగ్‌ ‌సంస్థ, సిఐఐ గ్లోబల్‌ ‌లీడర్ సెంటర్‌‌కు భూములు కేటాయించేందుకు ఆమోదం తెలిపామన్నారు.

ఎస్‌ఐపిబి ప్రతిపాదనలకు ఆమోదం

విశాఖపట్నం జిల్లా కాపులుప్పాడలో ప్రీమియర్ స్కిల్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్‌,మెడికల్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ ఏర్పాటు కోసం ఉన్నత విద్యా శాఖ ద్వారా అదానీ ఫౌండేషన్ గ్రూప్‌కు ఎకరానికి రూ.15 లక్షల రాయితీ ధరతో 60.29 ఎకరాల భూమి కేటాయింపు చేయాలని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపిబి) చేసిన ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తిరుపతి జిల్లా శ్రీసిటీలో ప్రస్తుతం ఉన్న చాక్లెట్ తయారీ యూనిట్‌ విస్తరణకు మొండెలీజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీతో కూడిన టైలర్-మేడ్ ప్రోత్సాహకాలు ఇవ్వాలని, అనకాపల్లి జిల్లా పరవాడ ఇండస్ట్రియల్ పార్క్ లో 3.5 గిగావాట్‌ సోలార్ సెల్ తయారీ యూనిట్‌ కోసం అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎకరానికి రూ.65 లక్షల రాయితీ ధరతో 34.02 ఎకరాల భూమిని కేటాయిం‌చాలని, విశాఖపట్నం జిల్లా కనమంలో లాజిస్టిక్స్‌, లైట్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ఎకోబాక్స్ ఇండస్ట్రియల్ అసెట్-4 ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎకరానికి రూ.55 లక్షల చొప్పున 91.38 ఎకరాల భూమి కేటాయించాలని, కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసేందుకు జియోమైసూర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎల్‌ఎ ఫర్‌ అదర్స్‌ పాలసీ కింద 998.10 ఎకరాలను సేకరించి కేటాయించాలని, దేవాదాయ శాఖ అంగీకారం మేరకు 40.12 ఎకరాల దేవాదాయ భూమిని లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇంటిగ్రేటెడ్ మాంగనీస్ సింటర్ ప్లాంట్, డైరెక్ట్ రిడ్యూస్డ్ ఐరన్ ప్లాంట్ మరియు కార్బన్ పేస్ట్ ప్లాంట్ ఏర్పాటు కోసం బెర్రీ అలాయ్స్ లిమిటెడ్‌కు ఎకరానికి రూ.77.25 లక్షల రాయితీ ధరతో 93.43 ఎకరాల భూమి కేటాయింపు ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

మరికొన్ని నిర్ణయాలు

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఎ) కేసుల విచారణ కోసం విశాఖపట్నంలో జిల్లా సెషన్స్ జడ్జి స్థాయిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది, అనంతపురం జిల్లాలో టిడిపి జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం ఎపి ఆయిల్‌ ‌ఫెడ్‌‌కు చెందిన 2 ఎకరాల భూమి, రాయదుర్గంలో 50 సెంట్లను రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యాలయ నిర్మాణానికి, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో 0.50 ఎకరాల భూమిని టిడిపి మంగళగిరి నియోజకవర్గ కార్యాలయ నిర్మాణం కోసం ప్రతి ఏటా రూ.1,000/ చొప్పున 66 ఏళ్లు లీజు ప్రాతిపదికన, 99 ఏళ్ల వరకు పొడిగించడానికి అవకాశం కల్పించే ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలో 10.16 ఎకరాల భూమిని పుల్లడిగుంట గ్రామ పంచాయతీ పరిధి నుండి డీ-నోటిఫై చేయడం, "టోపు పోరంబోకు" నుండి "పట్టా/ఎడబ్ల్యడి/జిపి"గా మార్చడానికి చేసిన ప్రతిపాదనను కేబినెట్‌ అంగీకరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్