సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కేరళంలో 15కి పెరిగిన మృతులు

1 గంట క్రితం

kerala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 12:58 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఏడుగురు గల్లంతు

- మరో మూడు రోజుల పాటు 
భారీ వర్షాలు

- సహాయక చర్యలు ముమ్మరం : 
సిఎం విడి సతీశన్‌

- విపత్తును ఐక్యంగా ఎదుర్కొందాం : 
విపక్ష‍నేత పినరయి విజయన్‌

తిరువనంతపురం : కేరళం వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మరణించిన వారి సంఖ్య 15కి పెరగగా మరో ఏడుగురు గల్లంతయ్యారు. దక్షిణ తమిళనాడు తీరంపై తుపాను ఆవరించి వుండడంతో మరో మూడురోజుల పాటు కేరళం వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం వుందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) పేర్కొంది. ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రంలోని పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలతో పాటు 12 జిల్లలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. సోమ, మంగళవారాల్లో కేరళం-లక్షద్వీప్‌-‌కర్ణాకట తీరాల పొడవునా బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. వరద బాధితుల కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేసిన నిత్యావసర సరఫరాలు అనేక శిబిరాలకు చేరడం లేదనే ఫిర్యాదులు కూడా తలెత్తాయి. కాసర్‌‌గోడ్‌‌లో అలల ఉధృతికి తీర ప్రాంతం రోడ్డు కొట్టుకుపోవడంతో 200 కుటుంబాలకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వారికి రహదారి సౌకర్యం లేకుండా పోయింది. దాంతో ఆ కుటుంబాలను సహాయ శిబిరాలకు తరలిస్తున్నారు. ఎర్నాకుళంలో పలు ప్రధాన రిజర్వాయర్లు ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహిస్తున్నాయి. ఇడుక్కిలోకూడా భారీ వర్షాల కారణంగా డ్యామ్‌‌వద్ద నీటి స్థాయి పెరిగింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతుండడంతో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసిందని, వరద బాధితుల కోసం 316 సహాయ శిబిరాలు ప్రారంభించామని ముఖ్యమంత్రి వి.డి.సతీశన్‌ ‌ పత్రికా సమావేశంలో వెల్లడించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఐఎండి

ప్రమాదం పొంచిఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి హెచ్చరించింది. కొండచరియలు విరిగిపడే, మట్టిచరియలు జారే, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు తెలిపారు. నదీ తీర ప్రాంతాలు, డ్యామ్‌ల దిగువ ప్రాంతాల్లో ఉండేవారు పగటిపూటే సహాయ శిబిరాలకు చేరుకోవాలని, స్థానిక సంస్థలు, రెవెన్యూ అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం కోరింది. భారీ వర్షాల సమయంలో నదులు, జలవనరుల్లోకి స్నానానికో, చేపలు పట్టడానికో దిగవద్దని, వంతెనలపైకి ఎక్కి సెల్ఫీలు తీసుకోవడం, గుంపులుగా చేరడం చేయవద్దని కూడా అధికారులు కోరారు.

సమన్వయలోపంతో ప్రజలకు కష్టాలు : పినరయి విజయన్

విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యం, సమన్వయలోపం కారణంగా ప్రజలు కష్టాలు పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆగ్రహంవ్యక్తం చేశారు. సహాయ శిబిరాల నిర్వహణలో లోపాలున్నాయని, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ‘‘రన్నిలో ఒక డ్యామ్‌ను సరైన హెచ్చరిక లేకుండా తెరిచారన్న తీవ్ర ఆరోపణ వచ్చింది. వ్యాపారులు తమ దుకాణాల్లోని సరుకులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా తగినంత సమయం ఇవ్వలేదు. దీంతో వారు వీధుల్లోకి వచ్చి నిరసన తెలపాల్సి వచ్చింది’’ అని పినరయి విజయన్ పేర్కొన్నారు. సహాయ శిబిరాల్లో ఆహార పంపిణీలో లోపాలు ఉన్నట్టు ప్రభుత్వ సంస్థలే అంగీకరించాయని, అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా వలంటీర్లు, స్థానికులు, రాజకీయ కార్యకర్తలే స్వయంగా ఆహారం సిద్ధం చేసి పంపిణీ చేయాల్సి వచ్చిందన్నారు. ఆహారం, తాగునీరు, మందులు, సురక్షిత వసతి, నష్టపరిహారం సకాలంలో అందేలా చూడాలని ప్రభుత్వాన్ని పినరయి విజయన్ కోరారు. జరిగిన లోపాలను సమీక్షించి, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు, వలంటీర్లు, ప్రజలు అందరూ కలిసికట్టుగా ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్