సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సొంతదారులకు ఇస్తారా..

1 గంట క్రితం

land iss
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 03:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- పేదలకు పంచుతారా?

- • కార్పొరేట్లకు కట్టబెడతారా?

అగనంపూడి భూములపై ఆసక్తికర చర్చ

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖబ్యూరో : విశాఖపట్నం అగనంపూడిలోని ఎపి రిఫ్రాక్టరీస్‌ ‌పరిశ్రమకు గతంలో కేటాయించిన 174.43 ఎకరాల భూమి విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ భూమిని బ్యాంకులు జప్తు చేసుకోకుండా చూడాలని అసెంబ్లీ ఫిర్యాదుల కమిటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం జరిగిన ఆ కమిటీ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయంతో పలు కీలక అంశాలు తెరమీదకు వచ్చాయి. కమిటీ ఛైర్మన్‌ ‌రఘురామకృష్ణంరాజు చెప్పిన వివరాల ప్రకారం ఈ భూమి విలువ రెండు వేల కోట్ల రూపాయలు పైనే! దీంతో ఈ భూమిని ప్రభుత్వం ఏమి చేయనుందన్నది ఆసక్తి కరంగా మారింది. 2013 భూసేకరణ, పునరావాసం మరియు పారదర్శకత హక్కు చట్టం లోని సెక్షన్ 101 ప్రకారం ప్రభుత్వం సేకరించి ఇచ్చిన భూమిని ఐదేళ్ల లోపు లేదా నిర్దేశించిన గడువులోపు వినియోగించుకోకపోతే ఆ భూమిని అసలు భూమి యజమానులకు తిరిగి ఇవ్వాల్సిఉంది. లేని పక్షంలో ప్రభుత్వ ల్యాండ్ బ్యాంక్‌కు ఆ భూమిని బదిలీ చేయాల్సిఉంది. బదిలీ చేయాలంటే చట్టం ఉద్దేశం స్పష్టంగా ఉంది—ప్రజా ప్రయోజనం పేరుతో తీసుకున్న భూమిని వాణిజ్య ఆస్తిగా మార్చేందుకు కాదు; ప్రజా ప్రయోజనం నెరవేరకపోతే భూమిపై రైతుల హక్కును పూర్తిగా విస్మరించకూడదనే ఆలోచనతో ఈ నిబంధన తీసుకొచ్చారు. అయితే, అగనంపూడి భూమిని ప్రభుత్వం 1981లో సేకరించింది. ఆ పేరుతో రైతులకు వెనక్కి ఇవ్వకపోతే రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి లేదని తేలిపోతుంది.

రైతుల భూమితో

ఎపి రిఫ్రాక్టరీస్‌ కు కేటాయించిన 174,43 ఎకరాల భూముల్లో కేవలం 15 ఎకరాల్లో మాత్రమే ఆ సంస్థ నామమాత్రంగా పనులు చేసింది. మిగిలిన భూములను బ్యాంకుల తనాఖా పెట్టి భారీ మొత్తంలో రుణం తీసుకుని, ఆ తరువాత దివాళా ప్రకటించింది. ఈ తరహా చర్య ఈ ఒక్క సంస్థకే పరిమితం కాదు. అనంతపురం లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు కేటాయించిన 8,848 ఎకరాల్లో, సుమారు 4,400 ఎకరాలను తనఖా పెట్టి రూ.790 కోట్ల రుణాలు తీసుకున్న సంగతి తెలిసిందే. పరిశ్రమలు మాత్రం రాలేదు. కృష్ణపట్నం సెజ్‌‌లోనూ ఇదే స్థితి. అనంతపురం సైన్స్ సిటీకి కేటాయించిన 402.10 ఎకరాలు కూడా కేటాయించిన ప్రయోజనానికి వినియోగించలేదని కాగ్‌ ‌తూర్పూర పట్టింది. ప్రజా ప్రయోజనం పేరుతో రైతుల నుంచి భూములు సేకరించడం, పరిశ్రమలు ఆశించిన విధంగా రాకపోవడం, కంపెనీలు భూములను తనఖా పెట్టి రుణాలు పొందడం, చివరకు ప్రాజెక్టులు రాకపోయినా, ఆ భూములు మాత్రం రైతుల చేతికి తిరిగి చేరకపోవడం వంటివి వీటన్నింటిలోనూ కనిపిస్తాయి. సామాన్యులు రుణం చెల్లించకపోతే వెంటనే జప్తు, వేలం, రికవరీ చర్యలు మొదలవుతాయి. కానీ వేల కోట్ల రూపాయల విలువైన భూమిని పొందిన సంస్థ పరిశ్రమ ఏర్పాటు చేయకుండానే భూమిని తనఖా పెట్టి భారీ రుణాలు పొందినా, ఆ తర్వాత సంస్థ మూతపడినా, ఆ సంస్థల నిర్వాహకులపై ఎక్కువ సందర్బాలలో నామమాత్రపు చర్యలు కూడా ఉండవు.

​మొదటి హక్కు ఎవరిది?

ప్రజా ప్రయోజనం పేరుతో భూమిని తీసుకున్న తర్వాత నిర్ధేశించిన ఆ ప్రయోజనం నెరవేకపోతే ఆ భూమిపై మొదటి హక్కు ఎవరిదన్నది కీలకాంశం.

చట్టం రైతులకు ఆ భూమిని అప్పగించాలని చెబుతున్నప్పటికీ, ఏదో ఒక సాకుతో ప్రభుత్వం ఆ భూమిని తమ వద్దే ఉంచుకోవడం, లేదా కొత్త పారిశ్రామిక కేటాయింపుల కోసం ల్యాండ్‌ ‌పూల్‌‌గా మార్చడమో జరుగుతోంది. దీంతో రైతులు ఒకసారి భూమిని కోల్పోతే, అది తిరిగి తమ చేతికి వచ్చే అవకాశమే లేకుండా పోతోందన్న అభిప్రాయమే బలపడుతోంది. భూమి విలువ పది రెట్లు, వంద రెట్లు పెరిగినా దానిలో ఒక్క రూపాయి కూడా రైతుకు అందదు. అగనంపూడి భూముల విషయంలోనూ అదే జరుగుతోంది. 1978లో ఇక్కడ భూముల సేకరణ ప్రక్రియ ప్రారంభించినప్పుడు ఉన్న రేటుకు, ప్రస్తుతం ఉన్న ధరకు ఏ మాత్రం పొంతన లేదు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖ ఎదగడంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఫలితంగా అగనంపూడిలోనూ ఊహించని స్థాయికి ధరలు చేరాయి. ఈ ప్రయోజనం మాత్రం సొంతదారులకు కానీ, వారి వారసులకు కానీ దక్కే అవకాశం దాదాపుగా కనిపించడం లేదు. నిజానికి ఇక్కడి భూముల సొంతదారులు తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని దశాబ్ధాల తరబడి పోరాడారు. 1999లో ల్యాండ్‌ ‌లూజర్స్‌ ‌వెల్ఫేర్‌ ‌సొసైటీ పేరుతో హైకోర్టులో తమకు న్యాయం చేయాలనికోరుతూ రిట్‌ ‌పిటిషన్‌ ‌కూడా దాఖలు చేశారు. దశాబ్ధాలు గడిచిపోయాయి. భూములిచ్చిన వారి వారసులు వివిధ ప్రాంతాలకు చెదిరిపోయారు. దీంతో ఇప్పుడు వారి హక్కుల గురించి మాట్లాడే వారే లేకుండా పోయారు.

పేదల సంగతి ఏంటి?

విశాఖ జిల్లాలో ఇళ్ల స్థలాలు లేని వారి సంఖ్య లక్షల్లోనే ఉంది. ఎపి రి ఫ్రాక్టరీస్‌ ‌కోసం అగనం పూడిలో 74.81 ఎకరాల పట్టా భూమిని సేకరించగా, సనివాడలో 14.41, తలారివాని పాలెంలో 23.46 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని ఆ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ చేతు లెత్తేయడంతో, ఆ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించవచ్చు. కానీ, సరళీకరణ ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తరువాత పేదలకు భూమిని పంచడానికన్నా ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదు.

మరి ఎవరికీ...?

సొంత దారులకు వెనక్కు ఇవ్వకుండా... పేదలకు పంచకుండా ఇంత విలువైన భూమిని ప్రభుత్వం ఏం చేయనుందన్న విషయమై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆ భూములను మళ్లీ కార్పొరేట్లకు అప్పగించడం ఖాయమన్న అభిప్రాయం స్తానికంగా వినిపిస్తోంది. కొంత కాలంగా ఆ భూములను పొందడానికి కొందరు వ్యక్తులు, సంస్థలు చేస్తున్న ప్రయత్నాల గురించి స్థానికులు బాహాటంగానే చర్చించుకుం టున్నారు. ఈ జాబితాలో అధికారపార్టీలోని పలువురు నేతల సన్నిహితులు, బంధువులు పేర్లు కూడా వినపడుతున్నాయి. మరి.. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాల్సిఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్