- ప్రజా ప్రతినిధులకు కూడా సమర్పణ
- విలేకరుల సమావేశంలో ఎస్‌కెఎం నేతలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) రైతుల డిమాండ్లను దేశ పాలకులకు లిఖితపూర్వకంగా తెలియజేయనుంది. ఈ నెల 17న ఎస్‌కెఎం ఒక భారీ ప్రతినిధి బృందంతో ఢిల్లీకి చేరుకుని, ప్రధాన మంత్రికి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడికి, ముఖ్యమంత్రులకు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకులకు, ఎంపిలకు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాన్ని అందజేయనుంది. ఆ రోజు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహిస్తామని ఎస్‌కెఎం నాయకులు తెలిపారు. సోమవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌కెఎం నాయకులు పి కృష్ణప్రసాద్, రాజన్ క్షీరసాగర్, పురుషోత్తం శర్మ, సత్యవాన్, అవిక్ సహా, రావుల వెంకయ్య మాట్లాడారు. జులై 28న ఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో ఎస్‌కెఎం లేవనెత్తిన ఏడు డిమాండ్లను ప్రధాన మంత్రికి, ఇతరులకు లిఖితపూర్వకంగా తెలియజేయనున్నట్లు తెలిపారు. ‘అన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఉపసంహరించుకోవడం, స్వామినాథన్ కమిషన్ ప్రకారం పంటలకు మద్దతు ధరలు అందించడం, రుణమాఫీతో సహా గ్రామీణ రుణభారం, రైతులు, కార్మికుల ఆత్మహత్యలను అంతం చేయడానికి చర్యలు తీసుకోవడం, నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయడం, ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం, వేతనాన్ని రూ.700కు, పనిదినాలను 200కు పెంచడం, విద్యుత్ రంగ ప్రైవేటీకరణ బిల్లు, విత్తన బిల్లు, జాతీయ ఆహార భద్రతా సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవడం, బలవంతపు భూసేకరణను, కార్పొరేట్ల కోసం భూసేకరణను అంతం చేయడం’ వంటి డిమాండ్లు ఉన్నాయని తెలిపారు. ఈ డిమాండ్లతో నవంబరు 26న దేశవ్యాప్త ఆందోళన ప్రారంభమవుతుందని, అక్టోబరు 3న ఆందోళనకు వాలంటీర్లను నిర్ణయిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 10న రైళ్లను దిగ్బంధించడం, రోడ్లను దిగ్బంధించడం వంటి ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. ‘సంయుక్త కిసాన్ మోర్చాను దేశద్రోహిగా చిత్రీకరించడానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోంది. విద్యార్థుల నిరసనపై ‘ది ఆర్గనైజర్’లో ప్రచురితమైన కథనం దీనికి ఒక ఉదాహరణ. మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను విభజించడమే ఆర్ఎస్ఎస్, ‘ది ఆర్గనైజర్’ రాజకీయాలు. ఎస్‌కెఎం అనేది వాస్తవ వర్గ సమస్యలను ప్రజల ముందుకు తీసుకొచ్చే సంస్థ. రైతుల సమస్యల గురించి రాయడానికి ఎస్‌కెఎం సిద్ధంగా ఉండాలి’ అని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)