సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జంతర్‌ మంతర్‌ సరైన ప్రాంతం కాదు !

1 గంట క్రితం

jana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 12:54 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- నిరసనల స్థలంపై పిటిషన్‌‌ను విచారించిన సుప్రీం

- పరిశీలించాలంటూ కేంద్రానికి సూచన

న్యూఢిల్లీ : నిరసనలు నిర్వహించేందుకు జంతర్‌ ‌మంతర్‌ ‌సరైన ప్రదేశం కాదంటూ దాఖలైన ముఖ్యమైన పిటిషన్‌‌ను పరిశీలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు సోమవారం కోరింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదించాల్సిందిగా సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతాను కోరింది. జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద రాకపోకలు, వైద్య సదుపాయాలు కల్పించడం, మురుగునీరు వంటి అనేక సమస్యలు వున్నాయని, అందువల్ల నిరసనలు నిర్వహించేందుకు అది సరైన స్థలం కాదని భావిస్తున్నామంటూ ఆ పిటిషన్‌ ‌పేర్కొంది. సతీష్‌ ‌చంద్‌ ‌కౌశిక్‌ ‌ఈ పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ ‌చాలా కీలకమైనదని తాము భావిస్తున్నామని, అందువల్ల దీనిపై అవసరమైన సూచనలు తీసుకోవాల్సిందిగా సొలిసిటర్‌ ‌జనరల్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ నేతృత్వంలోని ‌త్రిసభ్య ధర్మాసనం కోరింది. నోటీసులు జారీ చేసి, ఈ అంశాన్ని విడిగా లిస్ట్‌ ‌చేయాల్సిందిగా బెంచ్‌‌ పేర్కొంది.

సాధారణంగా ప్రజల నిరసనలకు, ఆందోళనలకు, ప్రదర్శనలకు జంతర్‌‌మంతర్‌ ‌కేంద్రంగా వుంటోందని, అలా కాకుండా రామ్‌‌లీలా మైదాన్‌ లేదా మరే ఇతర పెద్దదైన, భద్రమైన గ్రౌండ్‌‌ను దేశ రాజధానిలో ప్రధాన నిరసనల వేదికగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‌ ‌కోరుతోంది. పిటిషనర్‌ ‌తరపున న్యాయవాది ఆకర్షణ్‌ ఆదిత్య తన వాదనలు వినిపిస్తూ, గతంలో జంతర్‌‌మంతర్‌ ‌వద్ద పరిమితమైన, నిర్వహించదగిన స్థాయిలో మాత్రమే నిరసనలు, ప్రదర్శనలకు అనుమతించేవారని గుర్తు చేసుకున్నారు. నేడు, డిజిటల్‌‌పరంగా సమీకృతమవుతున్న ఆందోళనకారులు కేవలం గంటల వ్యవధిలోనే వందల స్థాయి నుండి వేలాది స్థాయికి పెరిగిపోతున్నారని, వీరికి ఎలాంటి కమాండ్‌ ‌వ్యవస్థ కూడా వుండడం లేదని లేదా ధృవీకరించబడిన నిర్వాహకులు కూడా వుండడం లేదని అన్నారు. పైగా ఈ సంఖ్యను అంచనా వేయడం కూడా సాధ్యం కావడం లేదన్నారు. పార్లమెంట్, సెంట్రల్‌ ‌విస్టా, ప్రభుత్వ సంస్థలు, దౌత్య, వాణిజ్య ప్రాంతాలకు అత్యంత దగ్గరగా జంతర్‌‌ మంతర్‌‌ వుండడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడ సమీకృతం కాకుండా చూడాల్సి వుందని పిటిషన్‌ ‌పేర్కొంది. జాతీయ భద్రతల దృష్ట్యా కూడా ఇది సరైంది కాదని న్యాయవాది వాదించారు. పైగా ఈ ఆందోళనల వల్ల సుదీర్ఘమైన రీతిలో ట్రాఫిక్‌ ఆంక్షలు నెలకొనడంతో సెంట్రల్‌ ‌ఢిల్లీలో ప్రజల రాకపోకలకు, ప్రయాణాలకు తీవ్రమైన ఇబ్బందిగా వుంటోందని పిటిషనర్‌ ‌పేర్కొన్నారు. మరోసారి జులై 20నాటి సంఘటన ఇక్కడ పునరావృతం కాకుండా చూడాల్సి వుందని అన్నారు. దానిపై చీఫ్‌‌ జస్టిస్‌ ‌స్పందిస్తూ ‘‘ఎలా ఎదుర్కొనాలో వారికి (ప్రభుత్వానికి) తెలుసు, ఒకవేళ వారు చేయలేకపోతే, మా దగ్గరకు రండి.’’ అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్