- సంతకాల సేకరణలో సిహెచ్ నర్సింగరావు
ప్రజాశక్తి - రైల్వేకోడూరు (తిరుపతి): తిరుపతి రైల్వేకోడూరు నియోజకవర్గంలోని మంగంపేట ఎపిఎండిసి బేరైటీస్ కాపాడుకుందామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. మంగపేట బెరైటీస్‌ను పరిరక్షిద్దాం, బల్క్ టెండర్ను రద్దు చేద్దాం అంటూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళితో కలసి ఆయన ప్రారంభించారు. సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్, ఆర్ వెంకటేష్ ఆధ్వర్యంలో సిఐటియు జనరల్ బాడీ సమావేశం శనివారం రైల్వేకోడూరులో జరిగింది. ఈ సందర్భంగా సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ మంగంపేట బెరైటీస్ ప్రపంచంలోనే చాలా అరుదైన ఖనిజమని, ఈ ఖనిజాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యతని అన్నారు. ఈ ఖనిజం మొత్తం వూడ్చుకొనిపోతే పనులు పోతాయని, దేశానికే నష్టమని అన్నారు. బెరైటీస్ పౌడర్‌ను ఆయిల్ డ్రిల్లింగ్‌లో లూబ్రిగెంటుగా వినియోగిస్తారని, అది లేకపోతే ముడి చమురు తీసేందుకు వీలు కాదని, అలాంటి బంగారం లాంటి ఖనిజాన్ని ప్రభుత్వం ఆగమేఘాల మీద విదేశాలకు ఎగుమతి చేయడం సరికాదన్నారు. ఆ విధంగా చేయడం బంగారు బాతును కోసి వేసినట్లేనని ఉదహరించారు. ఈ ప్రాంత రైతులు త్యాగం చేసి భూములు ఇస్తేనే కదా ఇక్కడ గనులు ఏర్పడ్డాయని, ఆగ మేఘాల మీద 20 ఏళ్ల పాటు కొనసాగే వ్యాపారాన్ని కేవలం రెండు సంవత్సరాలలోనే పూర్తయితే ఆ తర్వాత ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందనే విషయాన్ని స్థానిక ప్రజలు గుర్తించాలని వివరించారు. బెరైటీస్‌ను కాపాడుకోవడం కోసం చలో ఎపిఎండిసి కార్యక్రమం చేపట్టామని, విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామని అన్నారు. త్వరలో మంగంపేట బెరైటీస్ పరిరక్షణ కోసం నిజ నిర్ధారణ కమిటీ వస్తుందని, ఆ కమిటీ ముందు ఈ ప్రాంత ప్రజలు వారి అభిప్రాయాలను వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ జయచంద్ర, టి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)