ఐదుగురు నిందితుల అరెస్టు.. రెండు కార్లు, ఆరు సెల్ఫోన్లు సీజ్
గండేపల్లి వద్ద ఎన్‌హెచ్–16పై పోలీసుల దాడి
ప్రజాశక్తి-కాకినాడ : గంజాయి అక్రమ రవాణాపై నిఘా ఉంచిన కాకినాడ జిల్లా పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి ఐదు కిలోల లిక్విడ్ గంజాయి (హషీష్ ఆయిల్) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.62.50 లక్షలుగా అంచనా వేశారు. అలాగే రెండు కార్లు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.67.80 లక్షలుగా పోలీసులు శుక్రవారం వెల్లడించారు.
గండేపల్లి మండలం జెడ్. రాగంపేట గ్రామ సమీపంలోని ఎన్‌హెచ్–16పై గురువారం ఉదయం 8 గంటల సమయంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, టీ ట్రీ షాపు ఎదురుగా రెండు కార్లలో గంజాయి మార్పిడి చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో విశాఖపట్నానికి చెందిన కోరుపల్లి రవితేజ (34), కాకినాడ జిల్లాకు చెందిన నాయిన రాజశేఖర్ (32), విశాఖపట్నానికి చెందిన మలిరెడ్డి సాయి రాఘవ (32), కేరళకు చెందిన వివేక్ వడక్కెకున్నిన్మెల్ (32), ఆకాష్ చెరియన్ (31) ఉన్నారు. పోలీసుల విచారణలో ఒడిశాలోని చిత్రకొండ ప్రాంతం నుంచి ఐదు కిలోల లిక్విడ్ గంజాయిని రూ.5 లక్షలకు కొనుగోలు చేసి, రాజమండ్రి మీదుగా కేరళకు చెందిన వ్యక్తులకు రూ.10 లక్షలకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో గంజాయి అప్పగించే సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాలతో పెద్దాపురం డీఎస్పీ ఏ.బి.జి. తిలక్ పర్యవేక్షణలో జగ్గంపేట సీఐ బి. తిరుపతిరావు, గండేపల్లి ఎస్ఐ యు.వి. శివ నాగబాబు, ఈగల్ బృందం ఈ దాడిలో పాల్గొన్నాయి. సమర్థవంతంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని, సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.








కామెంట్లు (0)