- పక్కనున్న ప్లైవుడ్ షాపులకు వ్యాపించిన మంటలు
హైదరాబాద్: నగరంలోని మైలార్దేవ్పల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్క్రాప్ గోదాంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ప్లైవుడ్ దుకాణాలకు వేగంగా వ్యాపించాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. మంటలు మరింత వ్యాపించే ప్రమాదం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా పక్కనే ఉన్న మరో రెండు కంపెనీలను అధికారులు ఖాళీ చేయించారు. అగ్నిప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలు చీకటిమయంగా మారాయి. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బంది చర్యలు కొనసాగిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.








కామెంట్లు (0)