ఆంధ్రజ్యోతి ఆదివారం “కొత్త పలుకు”లో రాధాకృష్ణగారు కమ్యూనిస్టులు ప్రత్యేకించి సిపిఐ(యం)పై మరోసారి ‘ఇంకు’ ఒలకబోశారు. తెలుగులో ఒక సామెత ఉంది. “పాడిందే పాడరా....” అని దీనినే గోబెల్స్ ప్రచారం అని కూడా అంటారు. ఆయన హిట్లర్ సామ్రాజ్యంలో అబద్దాలు వండి వార్చేవారు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే అదే నిజమవుతుందని ఫాసిస్టుల నమ్మకం. కొంత కాలం అది నడిచింది కూడా. ఆనాడు జర్మన్ పార్లమెంట్ భవనాన్ని వారే తగలబెట్టి కమ్యూనిస్టులపై తోసారు. మొదటి ప్రపంచ యుద్ధాన్ని వ్యతిరేకించినందుకు లెనిన్ ను జర్మన్ ఏజెంటు అని అపవాదు వేశారు. ఇలాంటి దుష్ప్రచారాలు కమ్యూనిస్టులకు కొత్త కాదు.
ఆధునిక యుగంలో సమాచార వ్యవస్థపై గుత్తాధిపత్యం పెరగడంతో వీళ్ళు ఏది రాస్తే అదే నిజమని నమ్మాల్సిన దుస్థితి జనానికి పట్టింది. మోడీ, గోడి మీడియా ఇందులో ఒక ఆకు ఎక్కువే చదివింది. రాధాకృష్ణగారు దీనినే జీర్ణం చేసుకున్నట్లున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని నూతనతరం ఓట్లతో అధికారంలోకి వచ్చిన మోడీ ఇప్పుడు అదే సోషల్ మీడియాపైనా, కొత్తతరం (జెన్`జెడ్)పై దాడిచేస్తున్నాడు. ఒక ఇంగ్లీషు ఛానెల్లో ఒకాయన “నేషన్ వాంట్స్ టూ నో” అంటూ పెద్దగా అరుస్తుంటాడు. ఆయనపేరు ఆర్నబ్గోస్వామి. ఇలాంటివారి నుండి రాధాకృష్ణగారు స్ఫూర్తిని పొందినట్లున్నారు. వాస్తవాలను కప్పిపెట్టి అసత్యాలను పదేపదే ప్రచారం చేసి నమ్మించే విద్యనే “పోస్ట్ ట్రూత్” అంటారు. 2019లో ఈ పదానికి డిక్షనరీలో చోటు లభించింది. ఆ డిక్షనరీనే ఆర్కే ఫాలో అవుతున్నారు. 2021 స్థానిక ఎన్నికలలో నోరు తెరవని సిపిఐ(యం) నాయకులు కొందరు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని, వైసిపి కన్నా వీరే ఎక్కువ భయపడుతున్నారని అక్కసు వెల్లగక్కారు. ఇందులో ఒక్కమాటకైనా విశ్వసనీయత లేదు.
2021 ఎన్నికల్లో పల్నాడు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సిపిఐ(యం)పై జరిగిన దాడులు, ఘోరాలపై ఎన్నికల కమిషన్‌కు రాసిన ఫిర్యాదుల్ని మీడియాకు కూడా విడుదల చేశాము. బహుషా ఆంధ్రజ్యోతి ఆర్కైవ్స్‌లో ఉండవచ్చు. దుమ్ముదులిపి బయటకు తీసి చదవండి. నాడు యంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలను టిడిపి మధ్యలోనే బహిష్కరించి చేతులెత్తేసింది. ఎక్కడా ప్రతిఘటించలేదు. వారి విమర్శలన్నీ మీడియానే పరిమితమయ్యాయి. సిపిఐ(యం) తన పోరాటాన్ని కొనసాగించింది. క్షేత్రస్థాయిలో సిపిఐ(యం) ఏం చేసిందో తెలుగుదేశం వారినే అడగండి వాస్తవాలు చెబుతారు.
నాటికి నేటికీ తేడా ఏమిటి ఆర్కే గారూ?
ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగి ఉంటే అనంతపురంలో వైసిపి ఎలా గెలవగలిగిందన్న ధర్మ సందేహం లేవనెత్తారు. 2021 ఎన్నికలపై చంద్రబాబు నిప్పులు చెరిగి ఇదేమి ప్రజాస్వామ్యమని విమర్శించారు. ఏక గ్రీవ ఎన్నికలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇప్పుడు తెలుగుదేశం అదే పని చేసింది. నాడు నేడు సిపిఎంపై దాడులు జరిగాయి. అయినా నాడు తెలుగుదేశం 349 వార్డుల్లో గెలిచింది. అదే అనంతపురం జిల్లాలో తాడిపత్రి మున్సిపాలిటీకి గెలుచుకున్నారు. కాకపోతే నేటి లెక్కలు, నాటి లెక్కలు తీస్తే సంఖ్యలు అవే, ఘర్షణలో, దాడులూ అవే కానీ పార్టీల స్థానం మారింది అంతే. ఒక్కసారి 2021 లెక్కల్ని, ప్రస్తుత లెక్కల్ని పోల్చిచూస్తే వాస్తవాలేంటో రాధాకృష్ణగారికి అర్థమవుతాయి.
సిపిఐ(యం) పై ఎందుకీదాడి?
గత వైసిపి ప్రభుత్వానికి, నేటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఒక విషయంలో సారూప్యత ఉంది. అది సిపిఐ(యం)పై పగబట్టినట్లు దాడిచేయడం. నాడు తెలుగుదేశం ఏజెంట్లని వైసిపి విమర్శిస్తే, నేడు వైసిపి ఏజెంట్లు అంటూ టిడిపి విమర్శిస్తుంది అంతే తేడా. నాడూ నేడూ సిపిఐ(యం) తన రాజకీయ వైఖరికనుగుణంగానే వ్యవహరించింది. బిజెపి, దాన్ని బలపరిచే పార్టీలను వ్యతిరేకిస్తున్నది. సరళీకరణ ఆర్థిక విధానాల పేరుతో ప్రజలపై భారాలు వేయడం, సహజవనరుల్ని లూఠీ చేయడం, అదానీ లాంటి కార్పొరేట్లకు సంపద కట్టబెట్టడంలో ఇద్దరిదీ ఒకే వైఖరి. నాడు వైసిపి చేసుకున్న అక్రమ ఒప్పందాలన్నింటినీ నేడు టిడిపి కొనసాగిస్తున్నది. రెండు పార్టీలు తమ తప్పుడు విధానాలను వ్యతిరేకిస్తున్నందునే సిపిఐ(యం)పై దాడిచేస్తున్నారు. సిపిఐ(యం) విమర్శలకు ప్రజల్లో విశ్వసనీయత ఉంది. అది పాలక పార్టీల పునాదిని దెబ్బకొడుతుంది. గతంలో వైసిపి “వై నాట్ 175” అని 11 స్థానాలకు కుదించుకుపోయింది. ఇప్పుడు టిడిపి 100 శాతం స్ట్రైక్ రేట్ అంటూ కొత్తరాగం అందుకుంది. స్థానిక ఎన్నికల్లో జరిగిన ఘోరాలన్నిటికీ ఈ నినాదాలే కారణం కావడం యాదృచ్ఛికం కాదు.
వైసిపి ఓటమి నుండి టిడిపి పాఠం నేర్చుకుంటాందా? లేదా ప్రజలను వదిలేసి మోడీ, షాలను పట్టుకొని గోదావరిలో మునిగిపోతుందో వారే తేల్చుకోవాలి. ఎటొచ్చి రాధాకృష్ణగారికి వచ్చే నష్టమేమీ లేదు. పేపర్ ఖర్చు, కాస్తంత ఇంకు తప్ప. ఇప్పటికైనా సిపిఐ(యం)పై ఇంకు ఒలకబోయడం మానుకుంటే వారి విశ్వసనీయత కొంతైనా నిలబడుతుంది.
- అరుణతార







కామెంట్లు (0)