సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

10న జైల్ భరోను జయప్రదం చేయండి

2 గంటల క్రితం

ramadevi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 12:10 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశానికి, వ్యవసాయ రంగానికి నష్టదాయకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్స్) రద్దు కోరుతూ ఈ నెల 10న నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రాలతోపాటు, నియోజకవర్గాల్లో విజయవంతం చేయాలని రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక సంఘాల సమావేశం సోమవారం జరిగింది. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ.. కృష్ణా డెల్టాకు సాగునీరు అందించలేమని కూటమి ప్రభుత్వం ప్రకటించటం దారుణమన్నారు. సాగు, తాగునీరు అందించలేమని చేతులేత్తేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగం పెద్దయెత్తున కదలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 10న ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక సంఘాలు సంయుక్తంగా జాతీయ పిలుపును జయప్రదం చేయాలన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్, లఖీంపూర్ ఖేరీలో ట్రాక్టర్, కార్లతో రైతులను, జర్నలిస్టులను తొక్కించిన సంఘటనలో ఐదుగురు మరణించారని, వారిని స్మరించుకుంటూ, కేంద్ర ప్రభుత్వం రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. రైతులకు కనీస మద్ధతు ధర ఇవ్వకపోగా, పంటల బీమా రైతులే చేసుకోవాలని, వరి పంట లేదు కాబట్టి ఇ-క్రాఫ్ నమోదు చేయలేమని చెప్పటం ప్రభుత్వ దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17న రైతుల విషయమై సమస్యలతో కూడిన వినతిపత్రాలను శాసన, పార్లమెంటు సభ్యులకు ఇవ్వాలని కోరారు. నవంబర్ 26 ఉద్యమానికి వల్లంటీర్లను ఎంపిక కార్యక్రమాన్ని రాష్ట్రంలో కనీసం మూడు ప్రాంతాల్లో నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ చివరి నాటికి అన్ని రాష్ట్రాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించాలన్నారు. నవంబర్ 26కు సన్నాహంగా గ్రామ, గ్రామానా ట్రాక్టర్ ర్యాలీలు, మోటారు సైకిల్ ర్యాలీలు, సభలు, సమావేశాలు, కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘాల నాయకులు వై కేశవరావు, ఎం యలమందరావు, సింహాద్రి ఝాన్సీ, ఉల్లిగడ్డ నాగేశ్వరావు, డి హరినాథ్‌, ఎం వెంకటరెడ్డి, సత్యనారాయణ, చుండూరు రంగారావు, గనిరాజు, నాగేంద్ర, శ్రీనివాస్ రాజు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి రమాదేవి, వివిధ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు, సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ నర్సింగరావు, ఎవి నాగేశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటసుబ్బయ్య, ఐఎఫ్‌‌టియు నాయకులు కె పోలారి, రామకృష్ణ, టియుసిఐ నాయకులు మరీదు ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్