ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రముఖ నాయకుడు మండలి వెంకట కృష్ణారావు జయంతిని ప్రతి ఏడాది ఆగస్టు 4న రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు మండలి వెంకట కృష్ణారావు జయంతిని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన వ్యయాన్ని ఆయా శాఖలకు కేటాయించిన బడ్జెట్ నుంచి భరించాలని సూచించింది.
సచివాలయ, హెచ్‌ఓడీ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పొడిగింపు
అమరావతిలోని రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 24 శాతం ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)ను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక వేతనంలో 24 శాతం చొప్పున, గరిష్ఠంగా నెలకు రూ.25 వేల వరకు హెచ్‌ఆర్‌ఏ చెల్లించనున్నారు. ఈ ఉత్తర్వులు 2026 జూలై 1 నుంచి 2027 జూన్ వరకు అమల్లో ఉంటాయి. అయితే 12వ వేతన సవరణ సంఘం అమలు జరిగే వరకు లేదా అమరావతిలో ఉద్యోగులకు క్వార్టర్లు సమకూర్చే వరకూ ఈ రెండింటిలో ఏది ముందుగా జరిగితే అప్పటి వరకు మాత్రమే ఈ వెసులుబాటు కొనసాగుతుందని పేర్కొంది.
ఎస్‌జిఎస్‌డబ్ల్యు అధికారులకు ప్రైవేటు వాహనాలు
రాష్ట్రంలోని 26 జిల్లాల స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు (ఎస్‌జిఎస్‌డబ్ల్యు) జిల్లా అధికారుల అధికారిక వినియోగం కోసం ప్రైవేటు వాహనాలను అద్దెకు తీసుకునేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి జిల్లా ఎస్‌జిఎస్‌డబ్ల్యు అధికారికి నెలకు రూ.45 వేల అద్దెతో వాహనాన్ని అద్దెకు తీసుకునేందుకు అనుమతించారు. సంబంధిత అధికారులు తమ పదవుల్లో చేరిన తేదీ నుంచి వాహనాల అద్దెను చెల్లించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వాహనాల అద్దె చెల్లించేందుకు ఇప్పటికే రూ.1.40 కోట్లకు పైగా బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఆ నిధుల నుంచే వాహనాల అద్దె ఖర్చును భరించనున్నారు. అద్దెకు తీసుకునే వాహనాల వివరాలను నిధి పోర్టల్‌లో నమోదు చేయాలని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.








కామెంట్‌లు (0)