పల్నాడు : ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు.. బాాగా కష్టపడి చదవి, అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు. సంపాదనలో బాగా స్థిరపడిన ఆ యువకుడు ఓ సొంత ఇంటిని కూడా కట్టుకున్నాడు. ఆ గృహప్రవేశ కార్యక్రమానికి తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాడు. కొడుకు ఎదుగుదల చూసి పొంగిపోయిన ఆ తల్లిదండ్రులు అంతలోనే కుంగిపోయారు. అందరితో కలిసి సరదాగా భోజనం చేసిన ఆ యువకుడు సడెన్‌గా హార్ట్ అటాక్‌కు గురయ్యాడు. ఈ ఘటనతో పల్నాడులో విషాద ఛాయలు అలముకున్నాయి. పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామానికి చెందిన రావిపాటి వెంకట రవితేజ (34) 2019లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఒహియో రాష్ట్రం కీవ్‌లాండ్‌లో నివాసం ఉంటున్న అతను.. ఇటీవలే కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు. గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుని, ఆ వేడుకల్లో పాల్గొనేందుకు అతడి తల్లిదండ్రులు కోటేశ్వరమ్మ, శ్రీనివాసరావు కూడా అమెరికా వెళ్లారు. ఈ నెల 18వ తేదీ రాత్రి అందరూ కలిసి సరదాగా భోజనం చేశారు. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో రవితేజకు ఒక్కసారిగా తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు 911 నెంబర్‌కు సమాచారం అందించగా, పారామెడికల్ సిబ్బంది చేరుకుని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండె నుంచి శరీరానికి రక్తాన్ని తీసుకెళ్లే ప్రధాన రక్తనాళం పొర చినిగిపోయిందని గుర్తించారు. వెంటనే సర్జరీ చేయాలి అని చెప్పడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. అయితే సర్జరీ తర్వాత కూడా రవితేజ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో ఆదివారం ఆస్పత్రిలోనే మరణించాడు. ఆనందంగా గడుపుతున్న సమయంలో ఇలా జరగడంతో అందరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. రవితేజకు పెళ్లవ్వగా భార్య వందనతో పాటు రెండేళ్ల కుమారుడు విహాన్ కూడా ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామం తీసుకురాకుండా అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహించే విధంగా తల్లిదండ్రులు, భార్య నిర్ణయం తీసుకున్నారు.
అమెరికాలో పల్నాడు జిల్లా టెకీ మృతి
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 21, 2026, 11:22 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)