విజయవాడ : విజయవాడలోని బాలోత్సవ్ భవన్ లో " దళిత ఘోష - సామాజిక శంఖారావం " మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ సోమవారం జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణలో కెవిపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కంకణాల ఆంజనేయులు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కారుసాల సుబ్బరావమ్మ, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు, వృత్తిదారుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ పూసపాటి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె సుబ్బారావమ్మ మాట్లాడుతూ .... ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తామని పాలకులు చెబుతున్నారు. అయితే సమాజంలో కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలు మాత్రం నేటికీ కొనసాగుతూనే ఉన్నాయని కెవిపియస్, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాలు నాయకులు అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు పూర్తయి, దేశం శత వసంతాల వైపు అడుగులు వేస్తున్నప్పటికీ మనిషిని మనిషిగా చూసే పరిస్థితి పూర్తిగా ఏర్పడలేదన్నారు. నేటికీ అనేక గ్రామీణ ప్రాంతాల్లో దళితులు ఇతరులతో సమానంగా కూర్చుని హోటళ్లలో తినలేని, కనీసం మంచినీరు తాగలేని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించిన దళిత యువత, ప్రజా ప్రతినిధులు సైతం కుల వివక్షను ఎదుర్కొంటున్నారని, దేవాలయ ప్రవేశం, ఉత్సవాల్లో పాల్గొనే హక్కు విషయంలో కూడా అనేక చోట్ల వివక్ష కొనసాగుతోందన్నారు. ఈ వివక్ష కారణంగా దళిత కాలనీల అభివృద్ధి, మంచినీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, ఉపాధి, భూమి, ఇళ్లు, స్మశానవాటికలు వంటి అనేక సమస్యలు తీవ్రమవుతున్నాయని పేర్కొన్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS), వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల నాయకత్వంలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1600 పై గ్రామాలు, పట్టణ వార్డుల్లో నిర్వహించిన ఆద్యయన యాత్రలు ద్వారా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని, దళితుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని వెల్లడైందన్నారు. 1600 ప్రాంతాల్లో సర్వే నిర్వహించగా 960 పై గ్రామాలు, వార్డుల్లో దళితులు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి కనీస స్మశానవాటిక కూడా లేదని గుర్తించామని, వెయ్యికి పైగా గ్రామాల్లో డ్రైనేజీ కాలువలు లేక దళిత కాలనీలు మురికి కూపాలుగా మారాయని, అగ్రవర్ణాల కాలనీలకు దూరంగా దళిత కాలనీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర రాజధాని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ దళితులపై దాడులు స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తామని, ప్రపంచాన్ని తలదన్నే రాజధానిని నిర్మిస్తున్నామని చెబుతున్న అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే దళితులపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని విమర్శించారు. తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన 34 ఏళ్ల దళిత యువకుడు చీకటి గోపి పోలీసుల అదుపులో తీవ్ర వేధింపులకు గురై మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని తుళ్లూరు మండలం దొండపాడులో దళిత యువకుడు మేకల రమేష్పై దొంగతనం ఆరోపణలు చేసి దాడి చేసిన ఘటనపై కూడా న్యాయపరమైన విచారణ జరిపించాలని కోరారు. పిఠాపురం నియోజకవర్గంలో దళితులపై సాంఘిక బహిష్కరణ ఆరోపణలు వచ్చినా సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు. మచిలీపట్నం మండలం పెద్దయాదర గ్రామంలో దళిత మహిళ భూమికి సంబంధించిన వివాదంలో ఆమెను బెదిరించి, ఇంటికి తాళాలు వేసి, పెట్రోల్ పోసి చంపుతామని బెదిరించిన ఘటనపై బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పంగులూరు మండలం నూజిళ్లపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టుకోవడానికి కూడా నెలరోజుల పాటు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రాష్ట్ర హోం శాఖామాత్యులు అనిత నియోజకవర్గం పాయకరావుపేట లో దళితులు యాభై సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న ఇళ్ళు తొలగించారు. కులం, మతం పేరుతో పేదల మధ్య చిచ్చులు పెట్టి సామాజిక ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, సామాజిక న్యాయ శక్తులు ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 30 న విజయవాడలో మహాధర్నా
దళిత కాలనీల అభివృద్ధి, సామాజిక న్యాయం, కుల వివక్ష, అంటరానితనం నిర్మూలన, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం సెప్టెంబర్ 30వ తేదీన విజయవాడ ధర్నా చౌక్, అలంకార్ సెంటర్‌లో ఉదయం 10 గంటలకు మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాధర్నాకు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహా ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.








కామెంట్‌లు (0)