ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జాతీయ రహదారిపై
పశు సంచార నివారణకు చర్యలు

29 జులై, 2026

amaravati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 06:13 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి: అమరావతి పరిధిలోని జాతీయ రహదారులపై పశువుల సంచారాన్ని నివారించడంతో పాటు రహదారి వినియోగదారుల భద్రతను మరింత పెంచేందుకు నిరంతర చర్యలు తీసుకుంటున్నట్టు జాతీయ రహదారుల సంస్థ పేర్కొంది. రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా, జాతీయ రహదారి-16 లోని చిలకలూరిపేట–విజయవాడ విభాగంలో పశువుల సంచారం ఎక్కువగా ఉన్న నాలుగు ప్రాంతాలు, అలాగే మరో మూడు ప్రమాదకర బ్లాక్ స్పాట్‌లను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు పేర్కొంది. చిలకలూరిపేట–విజయవాడ విభాగం, చిలకలూరిపేట బైపాస్,విజయవాడ బైపాస్, అలాగే జాతీయ రహదారి-544-డి పరిధిలోనే గిద్దలూరు–వినుకొండ విభాగాల్లో సంచార పశువులను నివారించే ప్రత్యేక కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు..ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ మేనేజర్, పెట్రోల్ బృందాలు సమీప గ్రామాల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, తమ పశువులను జాతీయ రహదారులపైకి వదలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశువుల యజమానులకు సూచిస్తున్నట్టు తెలిపారు. అలాగే పోలీసు శాఖ, మున్సిపల్ అధికారులు, గ్రామపంచాయతీలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, జాతీయ రహదారులపై కనిపిస్తున్న సంచార పశువుల్లో ఎక్కువ భాగం సమీప గ్రామాలకు చెందినవే కాగా వాటిని రహదారి పరిసరాల్లో స్వేచ్ఛగా మేత కోసం వదిలేయడం వల్ల అవి జాతీయ రహదారులపైకి వస్తున్నట్లు గుర్తించినట్టు తెలిపారు. వాహనదారులు కూడా అప్రమత్తంగా వాహనాలు నడపాలని, నిర్దేశిత వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జాతీయ రహదారులపై సంచార పశువులు కనిపించిన వెంటనే 1033 జాతీయరహదారుల అత్యవసర హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్