కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారతదేశం నక్సలిజం నుండి విముక్తి పొందిందని మార్చి 31, 2026న పార్లమెంటులో ప్రకటించారు. ఆగస్టు 15న ఎర్రకోట నుండి చేసిన_ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడి అవే మాటలు పునరుక్తం చేసారు. ఈ మధ్యలో ఉన్న నాలుగు నెలల్లో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో మూడు ప్రధాన పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏప్రిల్, మే నెలల్లో దేశ ఉత్తర భాగంలో రగులుకున్న కార్మికుల నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన చారిత్రాత్మక విద్యార్థి-యువజన ఉద్యమం, బంకిపూర్ ఉపఎన్నిక. గత మూడు దశాబ్దాలుగా బిజెపి ఆధిపత్యంలో ఉండి, ఇటీవలే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసిన ఈ స్థానంలో బిజెపి భారీ ఓటమి చవిచూసింది. ఈ పరిణామాలు బిజెపిని ఆత్మరక్షణలో పడేసాయనడంలో సందేహం లేదు. _మోడీ తన ప్రసంగంలో "దిమాగీ నక్సల్స్" (మేధో నక్సలైట్లు) ముప్పును ప్రస్తావించడాన్ని ఈ నేపథ్యంలోనే చూడాలి. సృజనాత్మకమైన ఆలోచనలు కరువైన కలవరపడే నాయకుడు గతంలో వాడిన వ్యూహాలు, ప్రకటనలపై ఆధారపడటం సహజం. "దిమాగీ నక్సల్" అనే ముద్ర గతంలో వాడిన "టుక్డే-టుక్డే గ్యాంగ్", "అర్బన్ నక్సల్", "ఆందోళన్ జీవి" వంటి లేబుళ్ల కొనసాగింపే.
ఫాసిజం ఎల్లప్పుడూ ఆవేశపూరిత జాతీయ భావాలను తన శత్రువులకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. నయా-ఫాసిస్ట్ లక్షణాలు కలిగిన ప్రస్తుత ప్రభుత్వ వ్యూహాలు కూడా అందుకు భిన్నంగా లేవు. మెజారిటీ మత విభజన రాజకీయాలు ఇప్పటికీ గణనీయమైన స్థాయిలో ప్రజలపై ప్రభావం చూపుతున్నప్పటికీ, నీట్ (NEET) పేపర్ లీక్‌పై జరిగిన ఐక్య నిరసనలు, ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యంగా యువతరంలో పెరుగుతున్న అసంతృప్తి ముందు అటువంటి విభజనవాద రాజకీయాల పరిమితులను స్పష్టం చేసాయి.
విద్యార్థులు, మహిళలు, కార్మికులు , రైతులకు దక్కింది శూన్యం
ప్రధాన మంత్రి ప్రసంగంలో చేసిన భారీ వాగ్దానాలు ఈ అసంతృప్తిని పరిష్కరించడానికి ఏమాత్రం కొరగాకుండా పోయాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ఇస్తామని ప్రకటించిన మరుసటి రోజే, "అనేక అవాస్తవ, ముద్రణ, అనువాద పొరపాట్లు, అలాగే గతంలో ఇచ్చిన ప్రశ్నలు మళ్లీ రావడం" కారణంగా యుజిసి-నెట్ లోని మూడు పేపర్లను తిరిగి నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫై చేసింది. పరీక్షల వ్యవస్థపైనే నమ్మకం లేనప్పుడు, ప్రతి పరీక్షా లీకులు, పొరపాట్లు, రద్దులు, పునఃపరీక్షల నిర్వహణతో కొట్టుమిట్టాడుతున్నపుడు చౌకగా కోచింగ్ కల్పిస్తామన్న హామీ అర్థరహితమని విద్యార్థి లోకం సరిగానే ఎత్తి చూపింది.
నూతన విద్యా విధానం (NEP) విజయం సాధించిందని మోడి ప్రకటించిన అదే రోజున, పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లా ఇందాస్ పరిధిలోని కరిషుండా గ్రామంలో బిజెపి గూండాలు జరిపిన క్రూరమైన దాడిలో గాయపడిన షేక్ మహమ్మద్ మాఫిక్ మరణించారు. అతని కుమారుడు అబ్దుల్ హఫీజ్ జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థి ఉద్యమంలో పాల్గొని, తమ గ్రామీణ పాఠశాలలోని సౌకర్యాలపై సిటిజన్ ఆడిట్ చేయడానికి ప్రయత్నించినందుకే మహమ్మద్ మాఫిక్‌ను దాడికి లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 94,000 కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని (రోజుకు సగటున 25 పాఠశాలలు), అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 2.26 కోట్ల మేర తగ్గిందని ఇటీవల నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంగీకరించడానికి నిరాకరిస్తున్న NEP 2020 వైఫల్యాన్ని ఇది స్పష్టం చేస్తోంది.
వారు ఇప్పుడు 'వన్ డే, వన్ యూనివర్సిటీ' పేరుతో జెన్-జీ (GenZ)ను చేరువ చేసుకునేందుకు ప్రయత్నించవలసి వచ్చింది. తద్వారా ప్రతి కేంద్ర మంత్రి ప్రతిరోజూ ఒక విశ్వవిద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను విని, యువజన సంక్షేమ పథకాలను వివరిస్తారు. అయినప్పటికీ, మన విద్యను వ్యాపారీకరించడానికి, కేంద్రీకరించడానికి, కాషాయమయం చేయడానికి ప్రయత్నిస్తున్న NEP లోనే సమస్య ఉందనే విషయాన్ని వారు అంగీకరించడం లేదు. ఇది కోచింగ్ సెంటర్ల పుట్టగొడుగులా పెరగడానికి, పేపర్ లీకులు, లోపభూయిష్ట పరీక్షల వంటి సమస్యలకు దారితీసింది. NEP ని రద్దు చేస్తే తప్ప మన విద్యార్థులకు న్యాయం జరగదు. తగిన ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు స్పష్టమైన ప్రయత్నాలు జరిగే వరకు భారతీయ యువతకు కూడా న్యాయం దక్కదు.
తన ప్రసంగంలో మోడీ మహిళా రిజర్వేషన్ చట్టం ఆమోదం పొందడాన్ని ప్రశంసించారు, ఆపై పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో ఇది అమలు జరిగేలా చూసే బాధ్యతను ప్రతిపక్షాలపై నెట్టారు. అయితే దీనికి తన ప్రభుత్వమే ఆటంకంగా ఉందనేది అందరికీ తెలిసిందే. జూలై 20 నుండి ఆగస్టు 13 వరకు జరిగిన వర్షాకాల సమావేశాల సమయంలో, వేలాది మంది మహిళలు జంతర్ మంతర్ పరిసరాల్లో నిరసన తెలిపారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా 33 శాతం మహిళా రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేసారు. మహిళా రిజర్వేషన్ల జాతీయ కూటమి ఆధ్వర్యంలో మహిళా సంఘాలు, పౌరసమాజ బృందాలు వివిధ రాజకీయ పార్టీలను కలవగా, ఈ అంశానికి మద్దతు ఇస్తామని హామీ లభించింది. అయినా బిజెపి పట్టించుకోవడం లేదు. వారికి ఈ చట్టం నియోజకవర్గాలను మార్చడానికి, తమకు అనుకూలంగా ఎన్నికల చిత్రపటాన్ని మార్చుకోవడానికి ఒక నెపం మాత్రమేనని స్పష్టమవుతోంది.
_రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసామని, అవకాశాలు కల్పించామని మోడీ చేసిన ప్రకటనలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయి. గత మూడేళ్లలో 32,000 మందికి పైగా రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు గణాంకాలు అందించిన రాష్ట్రాల లెక్కలు మాత్రమే ఇవి. ఎంతో గొప్పగా చెప్పుకునే విబి గ్రామ్ జి వల్ల గ్రామీణ ఉపాధి కల్పనలో 50 శాతం తగ్గుదల నమోదైనట్లు అధికారిక గణాంకాలు చూపుతున్నాయి. ఈ ఏడాది జూలైలో 68.94 లక్షల కుటుంబాలు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోగా, 7.67 కోట్ల పనిదినాలు అమలయ్యాయి . గత ఏడాది ఇదే నెలలో 1.42 కోట్ల కుటుంబాలు, 15.33 కోట్ల పనిదినాలు లభించినట్లు నమోదయ్యింది. _పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వడం, విద్యుత్ సవరణ బిల్లుపై ఆందోళనలను పరిష్కరించడంపై రైతులకు ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం ఇంకా నిలబెట్టుకోలేదు. దానికి బదులుగా, రైతు సంఘాలతో సంప్రదించకుండానే రైతు ప్రయోజనాలకు హాని కలిగించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో ముందుకెళ్తోంది. ఇక కార్మికుల విషయానికొస్తే, మోడీ వారిని ప్రస్తావించడమే మానేశారు. నాలుగు లేబర్ కోడ్‌లు కార్మిక అనుకూలమైనవనే బోలు వాదనలు ఈ ఏడాది ప్రారంభంలోనే పటాపంచలయ్యాయి. తమ హక్కుల కోసం కార్మికులు వీధుల్లోకి వచ్చి పోరాడారు.
ప్రధానికి పట్టని ప్రజా సమస్యలు
దేశంలోని అనేక ప్రాంతాల్లో పూరిళ్లు, కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రభావితమైన కుటుంబాలకు "మొత్తం దేశం వారికి అండగా నిలుస్తుంది" అనే హామీ తప్ప ప్రధాని వారి పునరావాసానికి, తక్షణ సాయానికి ముందుకు వచ్చిందే లేదు. వారి బాధ, ఆవేదన తనకు అర్థమవుతుందని ఆయన చెప్పుకున్నప్పటికీ, దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలు మాత్రం మోడీ కి జనం గురించిన పట్టింపు లేదనే భావిస్తున్నారు. బిజెపియేతర ప్రభుత్వాలు ఉన్న అనేక రాష్ట్రాలు వరదలు, కొండచరియలు విరిగిపడటం లేదా కరువు సమయంలో కోరిన నిధులలో చాలా స్వల్ప మొత్తాన్ని మాత్రమే కేటాయించడం ఇందుకు నిదర్శనం . నిధుల విడుదలకు విపత్తు తీవ్రత కాకుండా రాజకీయాలే కొలమానంగా మారాయి. 2018 నాటి తీవ్ర వరదల తర్వాత విదేశాల నుండి ఉదారంగా సహాయం అందించేందుకు ముందుకు వచ్చినప్పటికీ, విదేశీ సహాయాన్ని స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయాన్ని కేరళ ప్రజలు మరిచిపోరు. అయినప్పటికీ, విదేశీ నిధులను స్వీకరించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కేంద్ర హోంశాఖ గతేడాది అనుమతి ఇచ్చింది. పైగా వరదల సమయంలో ఆహార ధాన్యాల సరఫరా, వైమానిక దళ సేవలకు గానూ కేంద్రం కేరళ ప్రభుత్వం నుండి వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది. 2024 వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత కూడా కేరళకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. తీవ్ర సంక్షోభ సమయంలో కూడా రాష్ట్రాల మధ్య వివక్ష చూపుతున్నారు.
జాతీయ విపత్తు స్పందన నిధి (NDRF) కింద ఉన్న నిధుల్లో సగం కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదని ఇటీవల వచ్చిన కాగ్ నివేదిక వెల్లడించింది. 2024-25లో NDRF కింద మంజూరైన మొత్తం రూ. 11,474 కోట్లలో కేవలం రూ. 5,356 కోట్లు మాత్రమే రాష్ట్రాలకు బదిలీ చేయగా, రూ. 6,118 కోట్లు నిరుపయోగంగా మిగిలిపోయాయి. 'ఏ విధమైన అత్యవసర లేదా తీవ్రమైన పరిస్థితిని' ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన పి.యం. కేర్స్ ఫండ్ లో 2024-25 నాటికి రూ. 8,452 కోట్లు నిల్వ ఉన్నది. ఇందులో 93 శాతం నిధులను ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉంచినట్లు వివరాలు చూపుతున్నాయి. గత ఏడాది కేవలం రూ. 88 లక్షలు మాత్రమే విడుదల చేశారు, ఇది మొత్తం నిధిలో కేవలం 0.001 శాతం మాత్రమే. ఈ నిధిని ప్రధాన మంత్రి కార్యాలయం నిర్వహిస్తుంది, ఎటువంటి పరిమితి లేని కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను పొందుతుంది. అయినప్పటికీ ఈ నిధులను RTI చట్టం, CAG ఆడిట్‌ల నుండి కేంద్ర ప్రభుత్వం మినహాయించుకుంది . పారదర్శకత లేకపోవడం వల్ల, ఎలక్టోరల్ బాండ్ల పథకం తరహాలోనే అధికార పార్టీకి మేలు చేసేందుకు కంపెనీలు ఈ నిధిని ఉపయోగించాయా లేదా అనేది తనిఖీ చేసే వీలు లేకుండా పోయింది._
స్వేచ్ఛాయుత ఆలోచనలపై దాడిని నిలువరించాలి
వికసిత్ భారత్ వైపు సాగుతున్న నవభారతంగా మోడీ చిత్రించడానికి చేసిన ప్రయత్నాన్ని ఇవాళా రేపూ నమ్మేవాళ్ళు చాలా తక్కువ మంది . అందుకే "దిమాగీ నక్సల్" అనే కొత్త ముద్ర అవసరమైంది. అనుకూలురలో ఉన్మాదాన్ని, దారి తప్పడానికి సాహసించే వారిలో భయాన్ని కలిగించేందుకు ఈ పదాన్ని ముందుకు తెచ్చారు. ఆయుధాలు పట్టిన నక్సలైట్లను ఏ విధంగా ఒంటరిని చేసి అంతమొందించారో, తన వికసిత్ భారత్ భావనను నిజం చేసుకోవడానికి దిమాగీ నక్సల్స్‌ను గుర్తించి ఒంటరిని చేయడం అవసరమని ఆయన భావించారు.
ఆపరేషన్ కగార్ పేరిట జరుగుతున్న ఎన్‌కౌంటర్ హత్యలను నిలిపివేయాలని కోరుతూ గతేడాది వామపక్ష పార్టీలు ప్రధానికి సంయుక్తంగా లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. మావోయిస్టులు ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి, చర్చల కోసం ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పరిశీలించాలని పదేపదే కోరినప్పటికీ, కేంద్రం, బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల ద్వారా పరిష్కారాన్ని కోరకూడదని నిర్ణయించుకున్నాయి. ఆ తర్వాత జరిగింది విచ్చలవిడిగా బూటకపు హత్యలు , అమానుష నిర్మూలనా విధానమే. తప్పుదోవ పట్టి, తమ లక్ష్యాలను సాధించడానికి ప్రజాస్వామ్యరహిత మార్గాలను ఎంచుకున్న మావోయిస్టులను మోడీ ప్రభుత్వం హింసాత్మక విధానంతో అంతమొందించినట్లయితే, దిమాగీ నక్సల్స్‌ను గుర్తించి ఒంటరిని చేస్తామనే బెదిరింపు వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులన్నింటికీ , 'అధికారిక' కథనాన్ని ప్రశ్నించే, ఆమోదించని వారందరికీ వర్తించే బెదిరింపు. ఇది రాబోయే రోజుల్లో స్వేచ్ఛాయుత ఆలోచనలపై జరిగే దాడిని సూచిస్తుంది.
భీమా కోరేగావ్ కేసు, ఢిల్లీ అల్లర్ల కేసు, న్యూస్‌క్లిక్ కేసు వంటి వివిధ కేసుల్లో రాజ్యం నుండి వేధింపులకు గురైన వారిపై టుక్డే-టుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్, ఆందోళన్ జీవి మొదలైన ముద్రలు వేయబడ్డాయి. జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న , పోరాటాన్ని కొనసాగిస్తున్న యువతపై నిఘా, డాక్సింగ్, బెదిరింపులు, ప్రతీకార హింసలు లక్ష్యంగా చేసుకోవడం కొత్త ఒరవడితో కొనసాగబోతుందని ఎర్రకోట నుండి ప్రధాని మోడీ చేసిన ప్రసంగం సూచిస్తున్నది._ఈ దుష్ట పన్నాగాన్ని సంఘటితంగా ఎదుర్కోవడం, నిరోధించడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం.
- వ్యాసకర్త : -ఎం. ఎ. బేబి, సిపిఎం ప్రధాన కార్యదర్శి







కామెంట్‌లు (0)