కుటుంబంలో ఎవరైనా మరణిస్తే దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించి, అండగా నిలవడం మానవత్వం. కానీ రాజస్థాన్‌లోని కొన్ని గ్రామాల్లో దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. కుటుంబంలో ఎవరైనా చనిపోతే ‘మృత్యు భోజ్’ పేరుతో భారీ విందు ఇవ్వకపోతే సామాజిక బహిష్కరణకు గురికావాల్సి వస్తోంది. భర్త వదిలేసిన కూతురు పుట్టింటికి చేరినా, పిల్లలు ఇల్లు విడిచి వెళ్లినా, ప్రేమ వివాహం చేసుకున్నా జరిమానాలు విధిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. పేదరికంతో పోరాడుతున్న కుటుంబాలు మరణం తర్వాత కూడా అప్పులు చేసి విందు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ దురాచారానికి వ్యతిరేకంగా కొంతకాలంగా గ్రామస్తులు గళమెత్తుతున్నా, ఇటీవల బాధితులు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్‌లోని బర్లూట్ పరగణాలో మేఘ్వాల్ కమ్యూనిటీ ఆధిపత్యం ఉన్న ఎనిమిది గ్రామాల్లో మాండ్వరియా ఒకటి. గ్రామంలోని 250 కుటుంబాల్లో 35 నుంచి 40 కుటుంబాలు ‘హుక్కా-పానీ బంద్’ పేరుతో సామాజిక బహిష్కరణను ఎదుర్కొంటున్నట్లు బాధితులు చెబుతున్నారు. కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు ఘనంగా చావు భోజనం పెట్టకపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఒకసారి బహిష్కరణకు గురైతే బంధువులు, ఇతర గ్రామస్థులు ఆ కుటుంబంతో సంబంధాలు పెట్టుకోకూడదు. వారి ఇంటికి ఎవరైనా వెళితే వారిపైనా జరిమానా విధిస్తారు. ఊరిపెద్దల ఆదేశాల మేరకు వెయ్యిమందికిపైగా విందు పెట్టేందుకు దాదాపు రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. ఆర్థిక స్థోమత లేని కుటుంబాలు భూములు అమ్ముకోవడం, అప్పులు చేయడం ద్వారా ఈ భారాన్ని మోయాల్సి వస్తోంది. కొందరు పెళ్లిళ్లతో కలిపి చావు భోజనాలు నిర్వహిస్తూ ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆచారం బీహార్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లోనూ కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. అయితే అక్కడక్కడా దీనికి వ్యతిరేకత పెరుగుతోంది. దాల్-బాటీ, మాల్పువా, గులాబ్ హల్వా వంటి ఖరీదైన వంటకాలకు బదులు రోటీ, సబ్జీతో సంతాప సభలను నిర్వహిస్తున్నారు. మరికొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
చట్టం ఉన్నా.. కొనసాగుతున్న వెలి
మృత్యు భోజ్ ఆచారాన్ని అరికట్టేందుకు రాజస్థాన్‌లో 1960 నుంచే ‘రాజస్థాన్ మృత్యు భోజ్ నివారణ చట్టం’ అమల్లో ఉంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏడాది వరకు శిక్ష విధించే అవకాశం ఉంది. అయినా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆచారం పూర్తిగా కనుమరుగు కాలేదు. 2025 మార్చిలో దీనికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా రాజస్థాన్ హైకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ సూచనల మేరకు ఈ ఏడాది ఏప్రిల్‌లో వెలువడిన తీర్పులో ఒక వ్యక్తిని సామాజిక, ఆర్థిక జీవితం నుంచి పూర్తిగా దూరం చేసే ‘పౌర మరణం’తో సమానమైన సామాజిక బహిష్కరణకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయినప్పటికీ మాండ్వరియా వంటి గ్రామాల్లో అనధికార కుల పంచాయతీల ఆదేశాలతో విందులు, జరిమానాలు, బహిష్కరణలు కొనసాగుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామంలో ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. సజ్జలు, మొక్కజొన్న, పెసలు పండించే అనేక కుటుంబాలు కనీస అవసరాలకే ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో చావు విందుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి రావడం వారి ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తోంది.
పోలీసుల నుంచి కలెక్టర్ వరకు..
మాండ్వరియాకు చెందిన బాధిత కుటుంబాలు 2026 జూన్ 20న న్యాయం కోసం బర్లూట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాయి. పోలీసులు వారం రోజుల తర్వాత రావాలని చెప్పి, చివరకు రాజీపడాలని సూచించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో వారు పట్వారీని ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. జూన్ 25న 30 మందికిపైగా గ్రామస్థులు సిరోహి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందజేసి, కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ‘మాకు ఎవరు న్యాయం చేస్తారు?’ అంటూ నినాదాలు చేశారు. ఒకవైపు ఊరిపెద్దలు, వారి మద్దతుదారులు.. మరోవైపు సామాజిక బహిష్కరణకు గురైన కుటుంబాలు ఉండటంతో గ్రామంలో విభేదాలు తీవ్రంగా మారాయి. అయితే ఈ పరిస్థితిని మార్చేందుకు బాధిత కుటుంబాలు ముందుకు రావడం, ఈ దురాచారంపై ప్రశ్నించడం మార్పుకు తొలి అడుగుగా కనిపిస్తోంది.
చనిపోయిన వ్యక్తి జ్ఞాపకార్థం చేసే విందు, బతికున్న వారిని అప్పుల ఊబిలోకి నెట్టకూడదు. దుఃఖంలో ఉన్న కుటుంబానికి అండగా నిలవాల్సిన సమాజమే వారిని వెలివేయడం ఏ సంప్రదాయానికీ గౌరవం కాదు. చావు ఇంటి ముందు వడ్డించాల్సింది ఖరీదైన భోజనం కాదు.. ఆ కుటుంబానికి నాలుగు చేతుల సాయం, నాలుగు మాటల ఓదార్పు. అదే మానవత్వానికి నిజమైన అర్థం.







కామెంట్‌లు (0)