- 50 వేల ఎకరాలు తీసుకోవాలని అంచనా
- మూడోదశ కోసం కసరత్తు
- రావెల సమీపంలో ఎయిర్‌పోర్టు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అమరావతి రాజధాని భూ సమీకరణ పథకం విస్తరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మూడోదశలో భాగంగా ఇప్పటికే తాడికొండ మండలం మోతడకలో 2344 ఎకరాలు తీసుకునేందుకు ఉత్తర్వులు ఇచ్చిన సిఆర్ఢిఏ విమానాశ్రయం పేరుతో 4600 ఎకరాలు తీసుకునేందుకు సిద్ధమైంది. మొత్తం 11 గ్రామాల్లో సమీకరణ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. తాడికొండ రావెల సమీపంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు ఇప్పటికే ఆర్‌ఐఈటిఎస్ సంస్థ నివేదిక కూడా తయారు చేసింది. పిపిపి మోడల్‌లో లేదా డిబిఎఫ్‌ఓటి మోడల్‌లో దీన్ని నిర్మించనున్నారు. విమాన్రాశయంతోపాటు రైల్వేలైన్, ఇంటర్నల్ రింగురోడ్డు నిర్మాణం కోసం తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే తాడికొండ మండలంలోని మోతడక గ్రామంలో 2344 ఎకరాలకు సంబంధించి పూలింగు చేసేందుకు సిఆర్డిఏకు అధికారం ఇస్తూ పట్టణాభివృద్దిశాఖ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. తాడికొండతోపాటు మేడికొండూరు మండలంలోని మందపాడు రెవెన్యూ పరిధిలో కూడా రాజధానికోసం భూమిని తీసుకోనున్నట్లు సమాచారం. ప్రసుత్తం తాడికొండ మండల పరిధిలోని మోడతక గ్రామంలో పూర్తిగా సమీకరణ చేయనున్నారు. తాడికొండ, కంతేరులో రైల్వేలైన్, పెదకాకాని మండలంలోని కొప్పురావూరు, పెదకాకాని పరిధిలో రైల్వేలైన్ కోసం భూములు తీసుకునేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. ఇవి కాకుండా రావెల పరిధిలో సుమారు 4600 ఎకరాల పరిధిలో విమాన్రాశయం నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధించి ఫీజు బిలిటీ నివేదిక కూడా సిద్ధమైంది. దీనికి ఆమోదం తెలిపిన వెంటనే ప్రక్రియ ప్రారంభించనున్నారు. రావెలతోపాటు బండారుపల్లి, బేజాత్‌పురం, పొన్నుకల్లు, లచ్చన్నగుడిపూడి గ్రామాల్లో భూమిని సమీకరించాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో ఇప్పటికే గ్రామసభలు పూర్తి చేశారు. తమ భూములు సమీకరణకు ఇస్తామని నివేదికను గుంటూరు జిల్లా కలెక్టర్ ద్వారా సిఆర్డిఏకు పంపించారు. దీని ఆధారంగా వరుసగా ఆయా గ్రామాల్లో సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. పెదకాకాని, కొప్పురావురు గ్రామాల్లో ఎంత తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించలేదు. తాడికొండ మండలంలో గ్రామాలవారీగా భూముల వివరాలను పరిశీలిస్తే...
గ్రామంభూమి హెక్టార్లలో
మోతడక949
తాడికొండ5179.44
కంతేరు 1486
రావెల1460
బండారుపల్లి 1930
బేజాత్‌పురం1342
పొన్నెకల్లు 1546
లచ్చన్నగుడిపూడి1208
మందపాడు(మేడికొండూరు)791.44







కామెంట్‌లు (0)