ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

హెచ్చరిక లేబుళ్లు!

54 నిమిషాల క్రితం

lable
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 06:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాల మార్కెట్… దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఆధునిక జీవనశైలిలో భాగమైన ఈ ఆహారం మన ఆరోగ్యంపై, ముఖ్యంగా పిల్లలపై త్రీవ ప్రభావం చూపుతోందనేది చర్చనీయాంశంగా మారింది. నేడు మార్కెట్లో లభించే అత్యధిక శాతం ప్రాసెస్ చేసిన ఆహార ప్యాకెట్లపై ‘షుగర్ ఫ్రీ’, ‘సహజమైనది’, ‘కొలెస్ట్రాల్ ఫ్రీ’, లేదా ‘పోషకాలతో కూడినది’ అని ఆకర్షణీయమైన అక్షరాలతో ప్రచారం చేస్తుంటారు. కానీ నిజానికి ప్యాకెట్ వెనుక భాగంలో అతి చిన్న అక్షరాలతో ముద్రించే సమాచారాన్ని పరిశీలిస్తే... అందులో అధిక మొత్తంలో సేచురేటెడ్‌ కొవ్వులు, చక్కెర, అధిక ఉప్పు ఉన్నట్లు స్పష్టమవుతుంది. సాధారణ వినియోగదారుడికి ఈ సాంకేతిక పరిభాష లేదా చిన్న అక్షరాలను చదివి అర్థం చేసుకునే అవకాశం కానీ, సమయం కానీ ఉండవు. ఫలితంగా ‘ఆరోగ్యకరమైనది’ అని భావించి కొనుగోలు చేసే ఉత్పత్తులే స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బుల వంటి వ్యాధులకు దారితీస్తున్నాయి. ‘రంగురంగుల ప్రచారాలతో పిల్లలను ఆకర్షించే అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల వెనుక ఉన్న నిజమైన ప్రమాదాలను తల్లిదండ్రులకు స్పష్టంగా తెలియజెప్పేలా ప్యాకెట్లపై హెచ్చరికలు ఉండాలి. పిల్లల పోషకాహార రక్షణకు ఇది ప్రాథమిక సూత్రం’ అని యునిసెఫ్‌ చాలాకాలంగా హెచ్చరిస్తోంది. వాస్తవానికి ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లపై ఆరోగ్య హెచ్చరికలను ప్రముఖంగా ముద్రించాల్సి వుంది. వ్యాపార సంస్థలు గానీ, ప్రభుత్వాలుగానీ దీనిని చూసీచూడనట్లే వ్యవహరిస్తున్నాయి.

మన చేతుల్లోకి వచ్చే ప్రతి ప్యాకెట్‌ ఆహారం... మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కానీ ఆ ప్యాకెట్‌పై ఉండే పోషక విలువల పట్టికను చూస్తే సాధారణ వినియోగదారుడికి అర్థమయ్యేది ఎంత? స్పష్టమైన ఆరోగ్య హెచ్చరికల లేబుళ్లను తీసుకురావడంపై దాదాపు దశాబ్ద కాలంగా చర్చలు జరుగుతున్నప్పటికీ, అమలు మాత్రం ఆలస్యమౌతూనే వుంది. ఈ జాప్యంపై అత్యున్నత న్యాయస్థానం తాజాగా- కేంద్ర ప్రభుత్వం, ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘వినియోగదారుల ఆరోగ్య హక్కు... వాణిజ్య ప్రయోజనాల కంటే మిన్న’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నది ప్రభుత్వ విధానాల ప్రాథమిక లక్ష్యం కావాలి. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌21లో జీవించే హక్కుతో పాటు ఆరోగ్యంగా ఉండే హక్కు కూడా అంతర్భాగం. ప్రాసెస్డ్ ఫుడ్, కంపెనీల మాయాజాలంపై ‘ఆహార పరిశ్రమ మనల్ని పోషించడానికి ప్రయత్నించడం లేదు, అది మనల్ని వ్యసనపరులుగా మార్చడానికి ప్రయత్నిస్తోంది’ అంటారు ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ మార్క్ హైమన్. కనుక ప్రజల ఆరోగ్యానికి వ్యాపార ప్రయోజనాలు అడ్డంకి కాకూడదు. ‘ఆహార ప్యాకెట్లపై హెచ్చరిక లేబుళ్లు వినియోగదారులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడానికి ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తాయి’ అంటారు డబ్లుహెచ్‌ఓ మాజీ శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌.

ప్రజారోగ్యాన్ని కాపాడటానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐతో పాటు ప్రభుత్వం కూడా ఆహార ప్యాకెట్లపై స్పష్టంగా కనిపించేలా హెచ్చరిక లేబుళ్లను తప్పనిసరి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ పద్ధతి మంచి ఫలితాలనిచ్చింది. అయితే, ఆహార తయారీ పరిశ్రమలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం హెచ్చరిక లేబుళ్ల అంశాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నాయని నిపుణులు ఆరోపిస్తున్నారు. హెచ్చరిక లేబుళ్లకు బదులుగా ప్రకటనల తరహా 'స్టార్ రేటింగ్' విధానాన్ని తేవడం వినియోగదారులను దారితప్పించడమే అవుతుంది. ప్రజారోగ్యాన్ని వ్యాపార ప్రయోజనాల కంటే ప్రాధాన్యతాంశంగా చూసినప్పుడే దేశంలో పెరుగుతున్న స్థూలకాయం, మధుమేహ మహమ్మారులను అరికట్టడం సాధ్యమవుతుంది. హెచ్చరిక లేబుళ్లపై కేంద్ర ప్రభుత్వం ఇకనైనా జాప్యం వీడి పారదర్శకమైన విధానాన్ని తక్షణం అమలు చేయాలి. చిలీ, మెక్సికో వంటి దేశాల్లో ఆహార ప్యాకెట్ల ముందు భాగంలో కనిపించే స్పష్టమైన హెచ్చరికలు- వినియోగదారులకు సులభంగా నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తాయి. కంపెనీలను కూడా తమ ఉత్పత్తులలో చక్కెర, ఉప్పు, కొవ్వు తగ్గించే దిశగా ప్రోత్సహించాయని అనుభవాలు చెబుతున్నాయి. మన దేశం కూడా ఈ దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. వినియోగదారుడు ప్యాకెట్‌ కొనేటప్పుడు ముందుగా బ్రాండ్‌ను కాదు, తన ఆరోగ్యాన్ని చూడగలిగేలా లేబుల్‌ ఉండాలి. లేబుల్‌ అనేది కేవలం వ్యాపార సమాచారం కాదు; అది వినియోగదారుడి హక్కు. ఏ ఆహారాన్ని తినాలి, ఎంత తినాలి, ఏ ఆహారాన్ని దూరంగా ఉంచాలి అనే అంశంపై నిర్ణయం తీసుకునేంత స్పష్టమైన సమాచారం ప్రతి పౌరుడికి అందాలి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్