- ఎస్ఇసి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వార్డు సభ్యుల స్థానాలన్నీ ఏకగ్రీవమై, సర్పంచ్ పదవికి మాత్రమే ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ఒకే ప్రాంగణంలో, ఒకే ప్రాంతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను విలీనం చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. విలీనం చేసిన కేంద్రంలో ఓటర్ల సంఖ్య 650 మందికి మించకూడదని నిబంధన విధించింది. ఎన్నికల నిర్వహణలో పోలీసు బందోబస్తు, సిబ్బంది నియామకం, రవాణా తదితర ఖర్చులను తగ్గించడంతోపాటు నిర్వహణను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా నిర్దేశిత ప్రమాణాల మేరకు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ఒకే ప్రాంగణంలో, ఒకే ప్రాంతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను మాత్రమే విలీనం చేయాలని, వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలను కలపకూడదని స్పష్టం చేశారు.విలీన కేంద్రాల వద్ద ఓటర్లకు మార్గనిర్దేశం చేసేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల మార్పు, విలీనంపై ఆయా ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించడంతోపాటు పోటీలో ఉన్న అభ్యర్థులకు ముందుగానే సమాచారం అందించాలని ఆదేశించారు. ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు.







కామెంట్‌లు (0)