ప్రజాశక్తి - యానాం : మత్స్యకారుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా యానాం ఫిషరీస్ శాఖ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు. మత్స్యకార విద్యార్థుల్లో సెంటాక్ ద్వారా టాపర్లుగా ఎంపికైన వారికి ఈ విద్యా సంవత్సరం నుంచి ఫిషరీస్ శాఖ ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ అందించనున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్లో సుమారు 1,000 మందికి పెన్షన్లు మంజూరు చేశామని, డిసెంబర్ మొదటి వారంలోగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని వెల్లడించారు. కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న 242 మందికి కూడా ప్రస్తుత లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ పూర్తయిన అనంతరం మంజూరు చేస్తామన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో చేపలు, రొయ్యలను నిల్వ చేసేందుకు ఐస్‌పై అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా బోట్లలో మూడు నుంచి ఐదు టన్నుల సామర్థ్యం కలిగిన కూలింగ్ బాక్సులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. వీటి ద్వారా ఐస్ అవసరం లేకుండా సుమారు 15 రోజుల వరకు చేపలను నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ పరికరాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 75 శాతం సబ్సిడీ పొందేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. బోట్లలో డీజిల్ ఖర్చును తగ్గించేందుకు సోలార్, విండ్ ఎనర్జీ ఆధారిత వ్యవస్థలను ఏర్పాటు చేసే అంశంపై విదేశీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే రోజుకు సుమారు 50 లీటర్ల వరకూ డీజిల్ ఆదా చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ నాలుగు పథకాల ప్రతిపాదనలను భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆమోదం పొందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. నాలుగు నెలల కాలంలో యానాం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.62 కోట్ల నిధులను తీసుకువచ్చినట్లు మంత్రి వెల్లడించారు. తుపాను కారణంగా నష్టపోయిన యానాం ప్రజలకు మొదటి విడత సహాయంగా ఆదివారం సాయంత్రంలోపు అన్ని రేషన్ కార్డులకు రూ.5 వేల నగదు, 10 కిలోల బియ్యం ప్రభుత్వం అందించనున్నట్లు ప్రకటించారు. అనంతరం ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గులు, ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యానాం ప్రాంతీయ పరిపాలన అధికారి శివరాజ్ మీనా, ఫిషరీస్ శాఖ అధికారులు గొంతయ్య, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)