రేపు తెల్లవారుజామున నెల్లూరు - నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం
విపత్తుల నిర్వహణ సంస్థ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ‘మురసు’ తుపాను కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది ఆదివారం సాయంత్రం గంటకు 27 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని, చెన్నైకు 480 కిలోమీటర్లు, నెల్లూరుకు 550, మచిలీపట్నానికి 560, ఒంగోలుకు 600, విశాఖపట్నానికి 610 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడి ఆ తర్వాత వాయువ్య దిశగా ప్రయాణించి సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము సమయంలో నెల్లూరు - నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆ సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వరకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
తుపాను ప్రభావంతో సోమవారం నాడు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్‌టిఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రఖర్‌జైన్ పేర్కొన్నారు.. మధ్యాహ్నం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 80 నుంచి 90 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.







కామెంట్‌లు (0)