ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసిఇసి జ్ఞానేష్ కుమార్‌పై నేతల నిప్పులు

1 గంట క్రితం

delhipti-1793545485948-2721.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 12:38 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఢిల్లీ : ఓటు హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ఇండియా బ్లాక్‌ మహార్యాలీలో వివిధ పార్టీల నేతలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో ప్రజల ఓటు హక్కును హరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, ఎన్నికల కమిషన్‌ నిష్పాక్షికతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

1mababy.jpg

​మరో స్వాతంత్ర పోరాటం : ఎంఎ బేబీ

ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాసిస్టు పాలనను అంతం చేసేందుకు దేశంలో రెండో స్వాతంత్య్ర పోరాటం ప్రారంభమైందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ అన్నారు. ఓట్ల చోరీకి పాల్పడిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాల్సిందేనని, ఆయనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లతో రాంలీలా మైదానంలో ప్రజల మహాసముద్రం ఏర్పడిందని పేర్కొన్నారు. ఇండియా బ్లాక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మహార్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాంలీలా మైదానానికి గొప్ప రాజకీయ చరిత్ర ఉందని గుర్తు చేశారు. స్వాతంత్య్ర పోరాట కాలంలో మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, అంబేద్కర్‌, సర్దార్‌ పటేల్‌ వంటి నేతలు అనేక సభల్లో ప్రసంగించిన ప్రాంగణమిదని చెప్పారు. భగత్‌సింగ్‌ స్ఫూర్తితో యువత పోరాటాలకు సిద్ధమైన విప్లవభూమి అని అభివర్ణించారు. ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతూ మోడీ వరుసగా అధికారంలోకి వస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే మహిళల తాళిబొట్లు కూడా తెంచుకుపోతాయని ప్రచారం చేశారని అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఆ లక్ష్యాన్ని సాధించలేదని విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా, వారి ఆత్మహత్యలను రెట్టింపు చేశారని వ్యాఖ్యానించారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోసం పోరాటాలు కొనసాగుతాయని, వాటి ముందువరుసలో సిపిఎం ఎర్రజెండా ఉంటుందని స్పష్టం చేశారు.

1rahul.jpg

జ్ఞానేశ్‌ కుమార్‌ తప్పుకోవాల్సిందే : రాహుల్‌గాంధీ

ఓటర్ల జాబితాలు, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో అక్రమాలకు పాల్పడి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నికల విజయాలను కైవసం చేసుకుంటున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ అక్రమాలకు బాధ్యులైనవారు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సి వస్తుందని అన్నారు. గ్యానేశ్‌ కుమార్‌ కచ్చితంగా పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఆయనను తొలగించడం దేశాన్ని సరైన దారిలోకి తీసుకెళ్లేందుకు తొలి అడుగు అవుతుందని పేర్కొన్నారు. అనంతరం మోడీ, అమిత్‌షాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఓట్ల చోరీ ద్వారా బిజెపి, కేంద్ర ప్రభుత్వం ప్రజల గొంతును నొక్కేస్తున్నాయని, ప్రతి పౌరుడి భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నాయని విమర్శించారు. రాంలీలా మైదానంలో జరిగిన మహార్యాలీ ఏ రాజకీయ పార్టీకి, నాయకుడికి మాత్రమే చెందినది కాదని, రైతులు, కార్మికులు, యువత, సామాన్య ప్రజల నిరసనకు ప్రతిరూపమని చెప్పారు. ఎంతటి సంపద ఉన్నా, రాజకీయ అధికారాన్ని ఎంతగా దుర్వినియోగం చేసినా రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదనే విషయాన్ని ప్రధాని, కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని హితవు పలికారు.

1khage.jpg

మోడీని గద్దె దించితేనే ప్రజాస్వామ్య పరిరక్షణ : ఖర్గే

దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగాలంటే నరేంద్ర మోడీని అధికారం నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్‌ ప్రభుత్వాలు ఓట్ల చోరీ ద్వారా అధికారంలోకి వచ్చాయని ఆరోపించారు. ఈ ఓట్ల దొంగలను అధికారానికి దూరం చేయాలని అన్నారు. మోడీ, అమిత్‌ షాలు దళితులు, యువత, మహిళల ఓట్లను దొంగిలిస్తున్నారని విమర్శించారు. జ్ఞానేష్‌ కుమార్‌ పదవి నుంచి వైదొలిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జ్ఞానేష్‌ కుమార్‌ దాక్కున్నా వెంబడించి పట్టుకుంటామని వ్యాఖ్యానించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని అన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పోరాట యోధులేనని ఖర్గే పేర్కొన్నారు.

1akhiles.jpg

​బిజెపి ఓటమి ఉత్తరప్రదేశ్‌ నుంచే ప్రారంభం : అఖిలేష్‌ యాదవ్‌

రాంలీలా మైదానంలో మహార్యాలీకి ముందు ఉత్తరప్రదేశ్‌లో కోటిమందికి పైగా హిందువుల ఓట్లు తొలగించారంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేసిన ప్రకటన రాబోయే ఓటమికి ముందస్తు సాకు వెతుక్కోవడమేనని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ విమర్శించారు. రాష్ట్రంలో తన ప్రభుత్వం ఓడిపోతే అందుకు కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను బాధ్యులను చేయాలన్న ప్రయత్నమిదని అన్నారు.

1tejaswi.jpg

జ్ఞానేశ్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి : తేజస్వి యాదవ్‌

మహాభారతంలో శకుని కపట పాచికలతో అధికారం చేజిక్కించుకున్నట్టే మోడీ ప్రభుత్వం పదేపదే అధికారంలోకి వస్తోందని ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌ విమర్శించారు. నాటి శకుని స్థానంలో నేడు జ్ఞానేశ్‌ కుమార్‌, దుర్యోధనుడి స్థానంలో మోడీ ఉన్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారని ఆరోపిస్తూ జ్ఞానేశ్‌ కుమార్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకుని జైలుకు పంపాలని డిమాండ్‌ చేశారు.

1mamata.jpg

ప్రజాస్వామ్యంతోనే ప్రతీకారం : మమత

పశ్చిమ బెంగాల్‌ ఎస్‌ఐఆర్‌ బాధిత రాష్ట్రమని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో 90 లక్షల ఓట్లను తొలగించి బిజెపిని అధికారంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బెంగాల్‌ ఎస్‌ఐఆర్‌ బాధిత రాష్ట్రమని, ఈ అన్యాయాన్ని తాము వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే తాము ప్రతీకారం తీర్చుకుంటామని వ్యాఖ్యానించారు.

1deepankar.jpg

​పోరాడి విజయం సాధిస్తాం : దీపాంకర్‌ భట్టాచార్య

రాంలీలా మైదానంలో ఒక చరిత్రకు శ్రీకారం చుట్టామని సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య అన్నారు. ఈ పోరాటంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలోనూ దేశ ప్రజల పోరాటాలకు రాంలీలా మైదానం దిశానిర్దేశం చేసిందని గుర్తుచేశారు. ఇక్కడి నుంచి వినిపించిన ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరాలని ఆకాంక్షించారు.

abdulla.jpg

​తొలగించిన హిందువులంతా పాకిస్థానీయులా? : ఫరూక్‌ అబ్దుల్లా

ఎస్‌ఐఆర్‌లో ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన హిందువులు కూడా చొరబాటుదారులేనా? అని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా ప్రశ్నించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారందరినీ చొరబాటుదారులుగా చిత్రీకరిస్తే, ఉత్తరప్రదేశ్‌లో ఓట్లు కోల్పోయిన హిందువులంతా పాకిస్థానీయులా? అని నిలదీశారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వారు పాకిస్థానీయులంటూ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి తరచూ ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ దేశం కోసం తాము రక్తం ధారపోశామని గుర్తుచేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్