ఇండియా బ్లాక్ మహార్యాలీ సక్సెస్
రాంలీలా మైదానంలో పోటెత్తిన జనం
బిజెపి, మోడీ నిరంకుశ పాలన *నుంచి దేశానికి విముక్తి కల్పిస్తాం
విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు, కార్మికుల భారీ భాగస్వామ్యం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని ప్రతి ఓటును కాపాడుకుంటూ బిజెపి, నరేంద్ర మోడీ పాలన పట్టు నుంచి భారతదేశానికి విముక్తి కల్పిస్తామని ఇండియా బ్లాక్ నేతలు ప్రతినబూనారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన లక్ష్యంగా ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక రాంలీలా మైదానంలో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ (ఓటును కాపాడండి.. దేశాన్ని రక్షించండి) పేరుతో నిర్వహించిన మహార్యాలీ విజయవంతమైంది. ఈ ర్యాలీకి లక్షలాది మంది తరలివచ్చారు. ఎన్నికల వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేసే వరకు రాజీలేని పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.
జనసంద్రంమైన రాంలీలా మైదానం
ఆదివారం తెల్లవారుజాము నుంచే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిమంది ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి రాంలీలా మైదానం, పరిసర ప్రాంతాలు జనసందోహంతో నిండిపోయాయి. హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్ నుంచి, అజయ్ భవన్ నుంచి భారీ ప్రదర్శనలు బయలుదేరాయి. రాజ్యాంగ క్లబ్‌లో సమావేశమైన ఇండియా బ్లాక్‌కి చెందిన 200 మందికిపైగా ఎంపిలు పలు బస్సుల్లో ర్యాలీ ప్రాంగణానికి చేరుకున్నారు. మరోవైపు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నివాసమైన రాజాజీ నగర్ నుంచి ఇండియా బ్లాక్ నేతలు బహిరంగ వాహనాల్లో బయలుదేరి మింటో రోడ్డు మీదుగా రాంలీలా మైదానానికి చేరుకున్నారు. మొదటి వాహనంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఫరూక్ అబ్దుల్లా, ప్రియాంక గాంధీ, మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్ తదితరులు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వాహనాల వెంట పదివేలాది మంది పాదయాత్రగా తరలిరావడంతో నాలుగు కిలోమీటర్ల మింటో రోడ్డు నుంచి రాంలీలా మైదానానికి చేరుకోవడానికి రెండున్నర గంటలకుపైగా సమయం పట్టింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ సుమారు మూడున్నర గంటలు ఆలస్యమైనప్పటికీ ప్రజలు ఓపికగా నాయకుల కోసం ఎదురుచూశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి.
నినాదాలతో హోరెత్తిన హస్తిన
నాయకులు సభా వేదికపైకి చేరుకోగానే వివిధ రంగుల జెండాలు, నినాదాలతో మైదానం హోరెత్తింది. ‘ఓట్ల దొంగలు సింహాసనాలు దిగాలి’, ‘ఓట్ల దొంగలు ఎక్కడ కనిపిస్తారు? బిజెపి కార్యాలయంలో కనిపిస్తారు’ అంటూ నిరసనకారులు పెద్దఎత్తున నినదించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువత, కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో రాంలీలా మైదానం ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదాలతో మార్మోగింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారూ ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతిపక్ష పార్టీల ఐక్యత కేంద్రంలోని నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసింది. జాతీయ జెండాలతో పాటు వామపక్ష పార్టీల ఎర్రజెండాలు, త్రివర్ణ పతాకాలు, తెలుపు, ఆకుపచ్చ, నీలం రంగుల జెండాలు మైదానాన్ని రంగులమయం చేశాయి. భగత్‌సింగ్ నుంచి చేగువేరా వరకు పలువురు విప్లవ వీరుల చిత్రాలు ప్రదర్శించారు.
ర్యాలీ ముగిసే వరకు ప్రజల రాక కొనసాగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు నిరసనలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ తమ భాషల్లో నినాదాలు చేశారు. భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలకు చెందిన ప్రజలంతా ఒకే వేదికపై ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గొంతెత్తారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ అసలైన ఆత్మ అని చారిత్రక రాంలీలా మైదానం మరోసారి చాటిచెప్పింది.
ఈ మహార్యాలీలో మల్లికార్జున ఖర్గే, ఎంఎ బేబీ, దీపాంకర్ భట్టాచార్య, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, రాహుల్ గాంధీ, అంజలి భరద్వాజ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, విజూ కృష్ణన్, నేహా బోరా తదితరులు ప్రసంగించారు. సోనియా గాంధీ, బృందాకరత్, ప్రియాంక గాంధీ, అరుంధతీ రాయ్, ఐషి ఘోష్, ప్రకాశ్ రాజ్, కపిల్ సిబల్, ఎంపిలు కె.రాధాకృష్ణన్, అమ్రారాం, జాన్ బ్రిట్టాస్, ఎఎ రహీం, వి.శివదాసన్, ఆర్.సచ్చిదానందం తదితరులు పాల్గొన్నారు. కేరళ ప్రతిపక్ష నేత పినరయి విజయన్ తరపున హాజరైన నాయకులతో పాటు, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి నేత వి.డి.సతీశన్, వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, సిపిఎం నేతలు విజుకృష్ణన్, ఐద్వానేత పుణ్యవతి కూడా ర్యాలీలో పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)