ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉద్రిక్తతల నడుమ పోలింగ్‌..

1 గంట క్రితం

Pulivendula6-1793545361340-8157.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 12:28 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

  • చెలరేగిపోయిన కూటమి నేతలు

  • పలు చోట్ల రిగ్గింగ్‌‌లు, దౌర్జన్యాలు

  • సహకరించిన పోలీసులు

  • ఐదు చోట్ల రీపోలింగ్‌కు ఆదేశం

  • సాయంత్రం ఐదు గంటలకు 60.36శాతం ఓట్లు

  • ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి : ఎస్‌ఇసి

ప్రజాశక్తి- యంత్రాంగం : ఉద్రిక్తతల నడుమ రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ ఆదివారం జరిగింది. అధికారం అండతో కూటమి నాయకులు చెలరేగిపోవడంతో అనేక ప్రాంతాల్లో రిగ్గింగ్‌‌లు, బూత్‌ల ఆక్రమణలు, అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లపై దాడులు, ఓటర్లను అడ్డుకోవడం వంటి సంఘటనలు అనేక ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసుల సమక్షంలోనే కూటమి నాయకుల దౌర్జన్యకాండ జరిగింది. కొన్ని చోట్ల కూటమి నాయకులకు బాహాటంగానే సహకరించారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో ఈ తరహా సంఘటనలు పెద్ద ఎత్తున చోటుచేసుకున్నాయి. అనేకచోట్ల ప్రతిపక్షాలకు చెందిన ఏజెంట్లు కూడా పోలింగ్‌ ‌బూత్‌‌లలో లేని పరిస్థితి కనిపించింది. దీంతో రిగ్గింగ్‌ జరిగిన ప్రాంతాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని ప్రతిపక్షాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌ను కోరాయి.మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్‌‌మోహన్‌‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందలలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమ పార్టీకి చెందిన పోలింగ్‌ ఏజెంట్లను బూత్‌‌లలోకి రానీయకుండా అడ్డుకున్నారని జగన్‌‌మోహన్‌‌రెడ్డి ఆరోపించారు. 70 మంది పోలింగ్‌ ఏజెంట్లతో కలిసి ఆయన రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ‌కార్యాలయం వద్ద భైఠాయించారు. ప్రతిపక్షాల ఏజెంట్లు లేకుండా పోలింగ్‌ ‌ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించిన ఆయన పులివెందులలో రీపోలింగ్‌ ‌నిర్వహించాలని డిమాండ్‌ ‌చేశారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత విలేకరులతో మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్ చంద్ర పునేఠా ‌ పోలింగ్‌ ‌ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. పులివెందులలో ఏజెంట్లను అడ్డుకున్నారనడానికి ఆధారాలు లేవని, అందువల్ల అక్కడ రీపోలింగ్‌కు ఆదేశించలేమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్‌ ‌ప్రక్రియను పరిశీలించిన అనంతరం రాత్రి పదిగంటల ప్రాంతంలో నాలుగు పోలింగ్‌ ‌కేంద్రాలలో రీ పోలింగ్‌ ‌జరుపుతున్నట్లు ప్రకటించారు. అనంతపురం కార్పొరేషన్‌‌లోని 30వ వార్డులోని 30-3, ప్రకాశం జిల్లా చీమకుర్తి మున్సిపాల్టీలోని 14వ వార్డులోని 14-1, పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాల్టీలోని 23వ వార్డులో 23-1,23-2 పోలింగ్‌ ‌కేంద్రాల్లో రీపోలింగ్‌ ‌నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తిరుపతి జిల్లాలోని 36-4 డివిజన్‌‌లో రిపోలింగ్‌ ‌నిర్వహించనున్నట్లు ఆ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ‌ప్రకటించారు. ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు రాష్ట్రంలో 60.36శాతం పోలింగ్‌ ‌జరిగినట్లు

ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపాల్టీలో 83.86శాతం, అతి తక్కువగా విశాఖ కార్పొరేషన్‌‌లో 50.02శాతం పోలింగ్ జరిగింది.

​ నంద్యాల జిల్లా డోన్ మున్సిపాలిటీలో 36 వార్డులను కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆయన భార్య సుజాతమ్మ ఆధ్వర్యాన కూటమి శ్రేణులు ఆక్రమించి రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. ఈ మున్సిపాల్టీలోని 15, 18, 28 వార్డుల సిపిఎం ఏజెంట్లను, వైసిపి ఏజెంట్లను బలవంతంగా బయటకు గెంటివేసి, ఒక ప్రాంతంలో బంధించారు. బేతంచెర్లలో దాదాపు 15 వార్డుల్లో రిగ్గింగ్ పాల్పడ్డాయి. మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాల్టీలో సిపిఎం పోటీ చేస్తున్న 22వ వార్డులోనూ టిడిపి వారు రిగ్గింగ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాల్టీ 39వ వార్డులో టిడిపి, సిపిఎం మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సిపిఎంకు ఓటర్లు ఎక్కువగా ఓట్లు వేస్తున్నారని తెలుసుకున్న టిడిపి నాయకులు పోలింగ్ కేంద్రం వద్ద హల్‌‌చల్‌ చేశారు. తిరుపతిలో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని సిపిఎం నాయకులు అడ్డుకున్నారు. వైసిపికి చెందిన పలువురు మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు, గృహనిర్బంధం చేశారు. పోలింగ్‌ ‌కేంద్రాల నుంచి తమ ఏజెంట్లను కూటమి నాయకులు బలవంతంగా వెళ్లగొట్టారని, తమ పోలింగ్‌ ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా అధికారులు కూటమి పార్టీలకు కొమ్మకాశారని, పోలింగ్ కేంద్రాల్లో కూటమి ప్రజాప్రతినిధులను, అభ్యర్థులను యథేచ్ఛగా తిరగనిచ్చారని వైసిపి నాయకులు ఆరోపించారు.

​ పులివెందులలో కర్రలు, రాళ్లతో టిడిపి శ్రేణుల దాడులు

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉదయం నుంచి ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడుతూ బీభత్సం సృష్టించాయి. పట్టణంలోని మొత్తం 80 పోలింగ్‌ కేంద్రాలకుగానూ 70 కేంద్రాలను ఉదయం ఏడు గంటలకే టిడిపి శ్రేణులు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ఎన్నికల ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రం లో‌నికి రానీవ్వకుండా అడ్డుకున్నాయి. ఓటు వేసేందుకు వెళ్తున్న మహిళా ఓటర్లను సైతం అడ్డగించి, వారి చేతిలోని స్లిప్పులను బలవంతంగా లాగేసుకున్నాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ పట్టణంలోని గర్ల్స్‌ కాలేజీలోని పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్తుండగా ఒక్కసారిగా కర్రలు, రాళ్ల దాడికి పాల్పడ్డాయి. దీంతో, ఆమె కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సరస్వతి విద్యామందిర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద టిడిపి శ్రేణులు కర్రలతో దాడికి పాల్పడ్డాయి. బాలికల హైస్కూలు వద్ద టిడిపి, వైసిపి శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పులివెందులలోని 8, 9, 10 వార్డుల్లో ఓటు వేసేందుకు వెళ్తున్న వారిపై కొందరు రాళ్ల దాడికి పాల్పడటంతో ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యారు. 11, 12 పోలింగ్ కేంద్రాల వద్ద ఇరుగ్రూపుల మధ్య పరస్పరం రాళ్ల దాడి జరగడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి చెదర గొట్టారు. 21వ వార్డుతో పాటు కొన్ని ఇతర బూత్‌లలో ఓటు వేయడానికి వస్తున్న ఓటర్లను అడ్డుకుని, వారి ఓటర్ స్లిప్పులను లాక్కున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 1, 2 వార్డుల్లో ఓటు వేయనివ్వకుండా కొందరు అడ్డుకుంటున్నారని మహిళా ఓటర్లు ఆందోళనకు దిగారు. వైసిపి ఏజెంట్లను అడ్డుకుంటున్నారనే సమాచారంతో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి బాధిత ఏజెంట్లతో కలిసి ఆర్‌ఒకు ఫిర్యాదు చేసేందుకు జగన్‌ నివాసం నుంచి మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర అడ్డగింతలు, తోపులాటలు జరిగాయి. గేటుకు అడ్డుగా బస్సును నిలిపి వైసిపి శ్రేణులను పోలీసులు నిలువరించారు.

అనంతపురం30వ డివిజన్‌‌లో బిజెపి రిగ్గింగ్‌

అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 30వ డివిజన్‌‌లో కూటమి తరఫున బరిలో ఉన్న బిజెపి రిగ్గింగ్‌‌కు పాల్పడింది. వైసిపి ఏజెంట్లను భయపెట్టి బయటకు పంపించేశారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 45వ డివిజన్‌‌లో టిడిపి, వైసిపి నేతల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్‌ కేంద్రంలో కుర్చీలు విసురుకోవడంతో ఇరుగ్రూపులకు వారికీ గాయాలయ్యాయి. ఫర్నిచర్‌ ధ్వంసమైంది. కొద్దిసేపు పోలింగ్‌ ‌నిలిచిపోయింది. 39వ డివిజన్‌‌లో టిడిపి నాయకుల దాడిలో వైసిపి నాయకుడు ఈశ్వరయ్యకు గాయాలయ్యాయి. 38వ వార్డులోనూ, 1, 8వ డివిజన్లలోనూ వైసిపి, టిడిపి నాయకుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

ధర్మవరంలో బిజెపి, జనసేన నాయకులు పరస్పరం దాడులుశ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాల్టీ 11వ వార్డులో కూటమి పార్టీలోని బిజెపి, జనసేన నాయకులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు కలుగుజేసుకుని పోలింగ్‌ ‌కేంద్రం వద్ద ఉన్న అందరినీ చెదరగొట్టారు.

​డోన్‌లో వైసిపి నేతల నిరసన

నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్‌ ఎన్నికల్లో స్థానికేతరులతో టిడిపి వాళ్లు దొంగ ఓట్లు వేయిస్తున్నా పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదంటూ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు డోన్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించని ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. ఏజెంట్లు, మున్సిపల్ చైర్మన్, వార్డు మెంబర్ అభ్యర్థులు, వైసిపి నాయకులు, కార్యకర్తలతో భారీ ప్రదర్శనగా వెళ్లి డిఎస్‌‌పి కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఓటరుకు రూ.రెండు వేలు క్యూలైన్‌లో పంచుతున్నా అధికారులు చూసి కూడా స్పందించడం లేదని ఆరోపించారు.

తిరుపతిలో ఎంపి గురుమూర్తిని అడ్డుకున్న పోలీసుల

తిరుపతి ఎంపి మద్దెల గురుమూర్తి, మాజీ మేయర్ డాక్టర్ శిరీషలను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్ కు వెళ్లిన తిరుపతి ఎంపిని పోలీసులు అడ్డుకోవడంతో ‘ఇది కలెక్టరేటా? టిడిపి కార్యాలయమా? కలెక్టరేట్ బోర్డు తీసేసి టిడిపి కార్యాలయం బోర్డు తగిలించుకోండి’ అంటూ శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటగిరిలో వర్షం కారణంగా ఓటింగ్‌‌కు కొంత అడ్డంకిగా మారింది. తిరుపతి నగర పురవీధులు, పోలింగ్ బూత్ రోడ్లు మేయర్ అభ్యర్థి వాల్ పోస్టర్లతో నింపేశారు. తిరుపతి 60వ వార్డులో ఆదం సుధాకర్‌‌రెడ్డి అనుయాయలు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ జనసేన శ్రేణులు ఆరోపించాయి. దీంతో, ఇరుగ్రూపుల మధ్య వాగ్వాదం జరిగింది. తనను ఓడించేందుకు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ జనసేన అభ్యర్థి ఆకేపాటి సుభాషిణి కన్నీటి పర్యంతమయ్యారు. ​తిరుపతి 22వ డివిజన్ లో టిపిపిఎం స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద మాజీ మేయర్ డాక్టర్ శిరీష తన ఓటు హక్కు వినియోగించుకోడానికి వెళ్లిన క్రమంలో అక్కడే ఉన్న కొంతమంది మేయర్ శిరీషకు చెందిన ఓటర్ స్లిప్పును లాక్కునే ప్రయత్నం చేస్తూ అభ్యంతరకరంగా ప్రవర్తించారు.

గుంటూరులో రిగ్గింగ్‌

గుంటూరు విద్యానగర్ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్‌ ‌పోలింగ్‌ ‌కేంద్రం వైసిపి ఏజెంటు విజయ రెడ్డిపై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. దొంగ ఓట్లు వేసుకునేందుకు బ్యాలెట్ పేపర్లను లాక్కొని ఒకేసారి పది బాలెట్లను ఒక టిడిపి కార్యకర్త చేజిక్కించుకొని రిగ్గింగ్ కు పాల్పడుతుండగా వైసిపి ఏజెంట్ సుజాత రెడ్డి అడ్డుకున్నారు. ఆమె బ్యాలెట్ బాక్స్ ను పట్టుకొని తీవ్రంగా ప్రతిఘటించడంతో టిడిపి, వైసిపి మధ్య జరిగిన తోపులాటలోబ్యాలెట్ బాక్స్ కిందపడిపోయింది. బాక్స్ లోని బ్యాలెట్లు కింద పడ్డాయి. దీంతో, ఈ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. సత్తెనపల్లిలో 12వ వార్డు వైసిపి అభ్యర్థి గోవిందమ్మ కుమారుడు పెద్దింటి డీప్ చెందును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరులోని ఆరు వార్డుల్లో రీపోలింగ్ నిర్వహించాలని అధికారులను కోరామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. దొంగ ఓట్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపాలిటీలో ఎనిమిదో వార్డు వైసిపి అభ్యర్థి అర్చన మూర్తి, ఆమె భర్త నరసింహమూర్తిపై టిడిపి నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారు.

మాచర్లలో 23 డివిజన్‌లో రీపోలింగ్‌!

మాచర్ల పట్టణంలో జనసేన పార్టీ కార్యకర్తలు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో బూత్‌‌లతో జొరబడి వాటిని అక్రమించడంతో ఆ రెండు చోట్లా రీపోలింగ్‌‌కు అధికారులు నిర్ణయించారు. సాయంకాలం ఓటింగ్ పూర్తయిన తర్వాత ఎన్నికల అధికారులు ఈ రెండు పోలింగ్‌ ‌బూత్‌‌ల్లో ఎన్నికలు నిలిపివేసి రీపోలింగ్‌‌కు జరపాలని పైఅధికారులను కోరారు. ఇందుకు వారు ఆమోదించినట్లు సమాచారం. ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లా నందిగామ పదో వార్డులో వైసిపి పోలింగ్ ఏజెంట్ రౌడీషీటర్ అని టిడిపి ఆరోపించడంతో కొద్దిసేపు టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆ ఏజెంట్‌‌ను తప్పించారు.

ఒంగోలులో ఉద్రిక్తత

ప్రకాశం జిల్లా ఒంగోలులో సెయింట్ జేవియర్ పోలింగ్‌

కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్‌ ‌కేంద్రంలో ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. వైసిపి మేయర్ అభ్యర్థి కుప్పం ప్రసాద్, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జి చుండూరి రవిబాబు అక్కడికి చేరుకున్నారు. రిగ్గింగుకు ప్రయత్నిస్తున్నారని వైసిపి నేతలు బయట మోహరించారు. టిడిపి శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నాయి. పోలీసులు వైసిపి నేతలను పక్కకునెట్టేశారు.

మార్కాపురం మున్సిపాలిటీలోని ఆరో వార్డు ఎన్నికలకు సంబంధించి అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద టిడిపి చైర్మన్ అభ్యర్థి వక్కలగడ్డ మల్లికార్జునరావుకు, వైసిపి మాజీ మున్సిపల్ ఛైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణకు మధ్య జరిగిన వాగ్వివాదం చివరకు ఇరు పార్టీల మధ్య ఘర్షణకు దారితీయడంతో పోలీసులు వైసిపి చెందిన కొందరిని పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్