-అస్వస్థతకు గురికావడానికి వసతి లోపాలే కారణం
-ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అశోక్
ప్రజాశక్తి– కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) : కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు జ్వరాలతో అస్వస్థతకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆరిక అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు సరిపడా భవనాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఈ పరిస్థితులు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. పాఠశాలను ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ , ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సోమవారం సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ప్రస్తుతం జ్వరాలతో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే మెరుగైన వైద్యశాలలకు తరలించి చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యమూ వహించవద్దని స్పష్టం చేశారు. గురుకుల పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా భవనాలు నిర్మించాలని, తాగునీరు, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురికాకుండా ముందస్తు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, పాఠశాలలో వైద్య సిబ్బంది పర్యవేక్షణ ఉండాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బిడ్డిక అనిల్, సహాయ కార్యదర్శి ఆరిక గంగారావు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బిడ్డిక రమేష్, పాలక నరేష్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు కూరంగి సీతారాం తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)