దీపావళి అమ్మకాలపై నీళ్లు చల్లిన తేనెటీగలు .. ముగ్గురికి గాయాలు
ఫతేబాద్ (హర్యానా) : దీపావళి పండుగ వేళ భారీగా మిఠాయిలు అమ్మి లాభాలు ఆర్జించాలనుకున్న ఓ వ్యాపారికి తేనెటీగలు ఊహించని షాక్ ఇచ్చాయి. స్వీట్ల స్టాల్‌పై ఒక్కసారిగా దండెత్తిన తేనెటీగలు వ్యాపార ఆశలపై నీళ్లు చల్లాయి. ఈ అనూహ్య ఘటన హర్యానా రాష్ట్రంలోని ఫతేబాద్ ప్రాంతంలో, భివానీ వద్ద జరిగింది.
దీపావళి సందర్భంగా భివానీ ప్రాంతానికి చెందిన ఓ మిఠాయి వ్యాపారి పెద్ద మొత్తంలో స్వీట్లు తయారు చేయించి, విక్రయాల కోసం బహిరంగంగా స్టాల్ ఏర్పాటు చేశాడు. అయితే స్వీట్ల సువాసనకు ఆకర్షితమైన తేనెటీగల గుంపు ఒక్కసారిగా అక్కడికి చేరుకుంది. చూస్తుండగానే వేలాది తేనెటీగలు మిఠాయిలపై వాలడంతో స్టాల్ వద్ద పరిస్థితి గందరగోళంగా మారింది. వాటిని తరిమికొట్టేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పైగా తేనెటీగల దాడిలో ముగ్గురు సిబ్బంది గాయపడినట్లు సమాచారం. మిఠాయిలపై తేనెటీగలు తిష్టవేయడంతో వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు సైతం వెనుకడుగు వేశారు. చివరకు అమ్మకానికి సిద్ధం చేసిన మిఠాయిల్లో కొన్నింటిని ఉచితంగా పంపిణీ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనతో సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ వేళ లాభాల కోసం ఎదురుచూసిన వ్యాపారికి తేనెటీగల రూపంలో ఊహించని నష్టం ఎదురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
https://youtube.com/shorts/jOa4MQMvHto?si=3ysJpRSaJc70Rv0g







కామెంట్‌లు (0)