- గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి
- ఉదయం నేరుగా తిరుపతికి విమాన సర్వీసు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విజయవాడ విమానాశ్రయం నుంచి రోజుకు 22 విమాన సర్వీసులు నడుస్తున్నాయని, సుమారు 2,000 మంది ప్రయాణికులు ప్రతిరోజూ విమానాశ్రయాన్ని వినియోగిస్తున్నారని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆంధ్రాఛాంబర్స్ కార్యాలయంలో జరిగిన ముఖాముఖి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకేసారి 26 విమానాలను పార్కింగ్ చేసే సామర్థ్యం గన్నవరం విమానాశ్రయానికి ఉందని పేర్కొన్నారు. దేశంలో ప్రధాన నగరాలతోపాటు సింగపూర్ షార్జాలకు వారానికి మూడు సార్లు అంతర్జాతీయ విమాన కనెక్టివిటీ ఉందన్నారు. కొత్త టెర్మినల్ అక్టోబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. కొత్త టెర్మినల్‌లో ఆరు ఏరోబ్రిడ్జ్‌లు, ఎస్కలేటర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. విస్తరణకు కూడా అవకాశం ఉందన్నారు. ఫ్లై91 సంస్థ త్వరలో తిరుపతికి ఉదయం విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. యూరప్, అమెరికా దేశాలకు ప్రయాణించే వారికి దుబాయ్‌కు ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ అవసరమని పేర్కొన్నారు. కొత్త టెర్మినల్ కార్యకలాపాలు ప్రారంభమైన అనంతరం హబ్ అండ్ స్పోక్ మోడల్ అమలు చేసే అవకాశం ఉంటుందని, దీనివల్ల భద్రతా తనిఖీలు బ్యాగేజీ చెక్-ఇన్ ప్రక్రియ విజయవాడ విమానాశ్రయంలోనే పూర్తయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. దాని నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌ను కార్గో టెర్మినల్‌గా మార్చుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎపి ఛాంబర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ, విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఇతర నగరాలకు అనుకూలమైన సమయాల్లో విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరారు. త్వరగా పాడయ్యే వ్యవసాయ, ఇతర ఉత్పత్తుల కోసం ప్రత్యేక కోల్డ్ స్టోరేజ్ కార్గో సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎపి ఛాంబర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బి. రాజశేఖర్, జనరల్ సెక్రటరీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)