- ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి
- జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేందిరా ప్రసాద్
ప్రజాశక్తి-కాకినాడ : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీలు నిర్ణీత గడువు దాటి బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లోని వివేకానంద హాలులో నిర్వహించిన జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, డీఆర్వో డా. తిప్పే నాయక్, జడ్పీ సీఈవో లక్ష్మణ్‌రావు, సీపీఓ త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు అధికారి జె. వేణుగోపాల్ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణకు ముందు గతంలో పీజీఆర్‌ఎస్ ద్వారా అందిన ఫిర్యాదులపై శాఖల వారీగా తీసుకున్న చర్యలను కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, గడువులోగా పరిష్కరించడంతో పాటు అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని సూచించారు. ప్రత్యేకంగా ఆర్‌ఓఆర్ కేసులు, రెవెన్యూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖాధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే బదిలీ చేయాలని సూచించారు. అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం అందించడంతో పాటు ఎండార్స్‌మెంట్ జారీ చేసే ముందు అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)