- జనాభా, సేవల లబ్ధిదారులు, సేవా విస్తీర్ణం, ప్రమాణాల ఆధారంగా కేటాయింపులు
- రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకిరాని మార్కాపురం, పోలవరం జిల్లాలు
- తాత్కాలికంగా సాధారణ కేడర్ కేటాయింపులే
- కీలక మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్థికశాఖ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో కొత్త జోన్లలో స్థానిక కేడర్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లా, జోన్, మల్టీ-జోన్ స్థానిక కేడర్లలో పోస్టుల సంఖ్య నిర్ణయించడం, వాటిని కొత్త స్థానిక కేడర్లకు పంపిణీ చేయడం, ఉద్యోగులను కేటాయించడం వంటి అంశాలపై ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక కేడర్లను పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో, కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ-జోన్లకు అనుగుణంగా ప్రతి శాఖ తన కేడర్ బలాన్ని నిర్ధారించి పంపిణీ చేయాల్సి ఉంటుంది.
ప్రతి స్థానిక కేడర్‌లోని శాశ్వత, తాత్కాలిక, సూపర్‌న్యూమరీ పోస్టులను పరిగణనలోకి తీసుకొని కేడర్ బలాన్ని నిర్ణయించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అయితే సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, అఖిల భారత సర్వీసు అధికారులు, న్యాయ శాఖ, శాసనసభ సచివాలయం, గవర్నర్ కార్యాలయం, ప్రభుత్వ రంగ సంస్థల పోస్టులకు ఈ మార్గదర్శకాలు వర్తించవని పేర్కొంది. పాత జిల్లాలు, జోన్లలో ఉన్న పోస్టులను కొత్త స్థానిక కేడర్లకు పంపిణీ చేసేందుకు ప్రతి శాఖ పోస్టుల కేటాయింపు నిష్పత్తులు రూపొందించాలని స్పష్టంచేసింది. ఇందుకోసం జనాభా, సేవల లబ్ధిదారులు, సేవా విస్తీర్ణం, సేవా కేంద్రాల సంఖ్య వంటి ప్రమాణాలను ఆధారంగా తీసుకోవాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో సూచించింది.
నాలుగు దశల్లో ప్రక్రియ
కేడర్ బలం తుది కేటాయింపును నాలుగు దశల్లో పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొదట కేటాయింపుకు వచ్చే కార్యాలయాలను గుర్తించడం, అనంతరం పోస్టుల కేటాయింపు నిష్పత్తులను నిర్ణయించడం, అనంతరం కేడర్ బలం, అవసరమైన కేడర్ను పంపిణీ చేయడం, చివరగా ప్రతిపాదనలను సంబంధిత శాఖల ద్వారా ఆర్థిక శాఖకు పంపించి తుది ఆమోదం పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
మార్కాపురం, పోలవరం జిల్లాలకు తాత్కాలిక కేటాయింపు
2025 రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్కాపురం, పోలవరం జిల్లాలు ఇంకా చేర్చనందున, ప్రస్తుతం ఈ రెండు జిల్లాలకు తాత్కాలికంగా పోస్టుల కేటాయించాలిని ప్రభుత్వం ఆదేశించింది. భవిష్యత్తులో జరిగే తుది కేటాయింపులతో పాటు ఈ రెండు జిల్లాలకు కూడా తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులు కూడా జారీ చేయనున్నట్లు తెలిపింది.
పలు పరిపాలనా చర్యలపై తాత్కాలిక నిషేధం
స్థానిక కేడర్లకు ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యే వరకు అన్ని శాఖల్లో కొత్త పోస్టుల సృష్టి, పోస్టుల అప్‌గ్రేడేషన్, కొత్త నియామకాలు, పదోన్నతులు, బదిలీలు, డిప్యుటేషన్లు వంటి పరిపాలనా చర్యలపై తాత్కాలిక నిషేధం విధించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిషేధం అమలులోకి వచ్చే తేదీని ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ప్రకటిస్తామని పేర్కొంది. ఈ ప్రక్రియపై అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, ప్రాంతీయ అధికారులు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
మల్టీ జోన్ -1 పరిధిలోని కొత్త జోన్ ల వివరాలు
జోన్ -1 శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి
జోన్ -2 అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, అంబెడ్కర్ కోనసీమ
జోన్ -3 ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ
జోన్ -4 గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు
జోన్ -5 తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య
మల్టీ జోన్ -2 పరిధిలోని కొత్త జోన్ ల వివరాలు
జోన్ -6 అనంతపురం, కర్నూలు, సత్యసాయి








కామెంట్‌లు (0)